న్యూఢిల్లీ: నిర్ణయాలు తీసుకోగలిగే కీలక పదవుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నప్పుడే నిజమైన సమానత్వం, న్యాయం సాధించగలమని కాంగ్రెస్ లీడర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకు ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘శక్తి అభియాన్’ లో చేరాలని ఆయన కోరారు.
గ్రామ స్థాయి నుంచి దేశం వరకు మార్పును తీసుకురావాలని కోరుకునే మహిళలందరూ ఇందులో జాయిన్ కావాలని సూచించారు. ‘‘నిజమైన మార్పును తీసుకురావాలనే ఆసక్తి ఉన్న మహిళలంతా శక్తి అభియాన్లో చేరాలని కోరుతున్నాను. మీరు రాజకీయాల్లోకి రావడం ద్వారా అట్టడుగు స్థాయిలో బలమైన వ్యవస్థను నిర్మించడం, అర్థవంతమైన మార్పును తీసుకురావడం సాధ్యమవుతుంది. అందుకు ఈరోజే శక్తి అభియాన్లో చేరండి”అని రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, పార్లమెంటు, అసెంబ్లీ సహా స్థానిక సంస్థల స్థాయి పాలనలో మహిళలకు చోటు కల్పించడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శక్తి అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది.