కేటీఆర్​లా.. జల్సాల కోసం అమెరికా వెళ్లలే : ఎంపీ చామల

  •  పెట్టుబడుల కోసమే రేవంత్​ పర్యటన 
  • కేసీఆర్ ఫామ్​హౌస్ దాటలేదని ఎద్దేవా
  • రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నది: ఎంపీ మల్లు రవి
  • పెట్టుబడులపై అనుమానాలు అక్కర్లే: జయేశ్​ రంజన్​
  • సీఎం రేవంత్​ పెట్టుబడుల కోసం వెళ్లిండు

న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్ లెక్క జల్సాలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటికి రాలేదని విమర్శించారు. చైనా, సింగపూర్ కు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని ఫైర్ అయ్యారు. పెట్టుబడుల కోసం మాత్రం ఏ నాడు కాలు బయటపెట్టలేదన్నారు. రేవంత్ విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో చామల మీడియాతో మాట్లాడారు.

 ‘‘పెట్టుబడులు రాబట్టుకునేందుకు స్వయంగా సీఎం రేవంత్ అమెరికా వెళ్తే.. బీఆర్ఎస్ లీడర్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకప్పుడు జల్సాలు చేసేందుకు విదేశాలకు వెళ్లిన వాళ్లకే ఇప్పుడు రేవంత్ అమెరికా ఒప్పందాలపై అనుమానాలు వస్తున్నయ్. తెలంగాణకు తానే సీఎం అన్నట్లు విదేశాల్లో కేటీఆర్ బిల్డప్ కొట్టిండు. రేవంత్ రెడ్డిది అధికారిక పర్యటన. అందులో అనుమానాల్లేవు. కేటీఆర్ పదేండ్ల కాలంలో విదేశాలకు వెళ్లి తెచ్చిన పెట్టుబడులపై బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా?’’అని చామల అన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి కృషితో హైదరాబాద్​కు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ రాబోతున్నదన్నారు. ‘‘రాష్ట్రాన్ని కంపెనీలకు రాసిచ్చినట్లుగా బీఆర్ఎస్ లీడర్లు చెత్త ప్రచారం చేస్తున్నరు. పెట్టుబడుల కోసం ముందుకొచ్చే కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు మాత్రమే చేసుకుంటది. ఆ కంపెనీలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోదు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎంవోయూలే.. అయినా, బీఆర్ఎస్ లీడర్లు గాయి.. గాయి చేస్తున్నరు’’అని అన్నారు. కవిత బెయిల్ కోసం వచ్చిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో మూడ్రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ను బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయన్న అనుమానం కలుగుతున్నదన్నారు.

రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతున్నది: మల్లు రవి

తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతున్నదని ఎంపీ మల్లు రవి అన్నారు. తన కుటుంబ సభ్యుల కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ లాగా కుటుంబ సభ్యులకు అధికారం కట్టబెట్ట లేదన్నారు. ప్రెస్​మీట్​లో ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా పాల్గొన్నారు.