రుణమాఫీపై బీఆర్ఎస్​కు మాట్లాడే అర్హత లేదు

  • ఎమ్మెల్యేలు బాలూనాయక్, వేముల వీరేశం, జై వీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : రైతు రుణమాఫీపై బీఆర్ఎస్​కు మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. శనివారం నల్గొండలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలూనాయక్, ఎమ్మెల్యే వేముల వీరేశం, జైవీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలోని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. వచ్చే మూడేండ్లలో నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని చెప్పారు. గ్రామాల్లో ఉనికి కోల్పోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకులు బీసీ కులగణనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్నివర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీసీ కులగణనను చేపట్టామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో పదేండ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు.

తెలంగాణలో బీసీ కులగణన, సమగ్ర కుటుంబ సర్వేలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో  డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్,  పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 
.