ఎమ్మెల్సీ సీటుకు కాంగ్రెస్​లో పోటాపోటీ

  • బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థులు కరువు

నాగర్​కర్నూల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్​ పార్టీలో లీడర్లు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. మొదటి నుంచి కాంగ్రెస్​ పార్టీనే నమ్ముకొని ఉన్న వాళ్లు, అసెంబ్లీ ఎలక్షన్స్​ ముందు పార్టీలో చేరిన వారు ఢిల్లీ, హైదరాబాద్​లో గాడ్​ఫాదర్స్​ను నమ్ముకున్న లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మహబూబ్​నగ ర్​ లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ స్థానం నుంచి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పలువురు లీడర్లు సీఎం రేవంత్​రెడ్డిని కలుస్తున్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం వైస్​ చైర్మన్​ పదవి కట్టబెట్టారు. ఓబేదుల్లా కొత్వాల్​కు మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరే షన్​ చైర్మన్​ పదవి ఇచ్చారు. దీంతో మిగిలిన నేతలు ఎమ్మెల్సీపై ఆశలు పెంచుకున్నారు. కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్​రెడ్డి, కొల్లాపూర్​ నుంచి సీఆర్​ జగదీశ్వర్​రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వయో భారంతో గుర్నాథ్​రెడ్డి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. సీఆర్​ జగదీశ్వర్​రావు కొల్లాపూర్​ నుంచి టికెట్​ ఆశించారు. కాంగ్రెస్​లో చేరిన జూపల్లికి పార్టీ టికెట్​ ఇచ్చి, జగదీశ్వర్​రావును బుజ్జగించారు. నాగర్​ కర్నూల్​ జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్, సీఎం రేవంత్​ సొంతూరు కొండారెడ్డిపల్లికి చెందిన వంగూరు జడ్పీటీసీ కేవీఎన్​ రెడ్డి ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్నారు.

బీఆర్ఎస్​ నుంచి అభ్యర్థి కరువు..

బీఆర్ఎస్​లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు ముందుకు రావడం లేదని సమాచారం. అసెంబ్లీ ఎలక్షన్స్​లో ఓడిపోయిన నాయకులు పార్లమెంట్​కు పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నారే తప్ప, స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై నోరు విప్పడం లేదు. మహబూబ్​నగర్​ లోక్​సభకు బీఆర్ఎస్​ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్​ రవికుమార్​ పేర్లు వినిపిస్తున్నాయి. 

నాగర్​ కర్నూల్​ నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు వినిపిస్తోంది. ఎమ్మెల్సీ అనగానే ఉలుకు పలుకు లేకుండా పోయింది. ఇద్దరు బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు కాంగ్రెస్​లో చేరారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీలో లేకపోవడంతో బీఆర్ఎస్​ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

ఇప్పుడు పోటీ చేస్తే మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. గెలుస్తామనే గ్యారెంటీ లేన్నప్పుడు ఎందుకు డబ్బులు వదిలించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని కాంగ్రెస్​ లీడర్లు సవాల్​​చేస్తున్నా బీఆర్ఎస్,​ బీజేపీ నేతల నుంచి ఎటువంటి రెస్పాన్స్​ లేదు. ఇదిలాఉంటే మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​ స్థానాలపై గురిపెట్టిన బీజేపీ లీడర్లు ఎమ్మెల్సీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం దాదాపుగా లేవనే చెప్పాలి.

ముందు వరుసలో మన్నె జీవన్​రెడ్డి!

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో ఎమ్మెల్సీ టికెట్​ రేస్​లో టీటీడీ బోర్డు మాజీ మెంబర్​ మన్నె జీవన్​రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎంపీ సీటు కోసం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ క్యాండిడేట్​గా వంశీచంద్​రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత మన్నెను బుజ్జగించి హైకమాండ్​ ఎమ్మెల్సీగా పోటీకి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. 

మన్నె జీవన్ రెడ్డికి కాంగ్రెస్​ పార్టీ ఎమెల్సీ ఎలక్షన్స్​లో బీఫాం ఇస్తుందని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఇదిలాఉంటే గతంలో స్థానిక సంస్థల కోటా కింద నాగర్​ కర్నూల్​ జిల్లా నుంచే ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి మహబూబ్​నగర్​ పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలోని నేతలకు ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నుంచి సంకేతాలు వచ్చినట్లు సమాచారం.