నామినేటెడ్​ పోస్టులపై లీడర్ల ఆశలు

  • పార్లమెంట్​ ఎలక్షన్​​ ముగిసినందున జోరుగా పైరవీలు
  • పదవులు పొందే పట్టుదలతో ప్రయత్నాలు 
  • ఇప్పటికే ఒక విడతలో  నలుగురికి  దక్కిన స్టేట్​ పోస్టులు 
  • మరో ఫేజ్​ పదవులపై  సీనియర్లు పోటీ 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు నామినేటేడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్​ ఎలక్షన్​ టైంలో జిల్లాలోని నలుగురు ముఖ్య నేతలకు పదవులు రాగా ఇంకా చాలా మంది  రేసులో ఉన్నారు. ఎన్నికలు ముగిసినందున వారు పదవుల కోసం మళ్లీ పైరవీలు షురూ చేశారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్​ సర్కారు రావడంతో ప్రయారిటీ పోస్టులు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. పార్టీలో తన సీనియారిటీ, ప్రతిపక్షంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. తమకున్న అర్హతలను సర్కారుకు  చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు.  నామినేటెడ్​ పోస్టులతో పాటు మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చాన్స్​ లభిస్తుందనే విషయంపై కూడా జోరు చర్చ నడుస్తోంది. 

లిస్టు పెద్దదే

ఇందూరు జిల్లా నుంచి నామినేటెడ్​ పోస్టుల కోసం పోటీపడుతున్న లీడర్ల సంఖ్య ఎక్కువే ఉంది.  అసెంబ్లీ ఎలక్షన్​లో పార్టీ హైకమాండ్​ నిర్ణయానికి కట్టుబడి పోటీ చేయలేకపోయిన ​నేతలకు ఫస్ట్​ ఫేజ్​లో పోస్టులు ఇచ్చింది. బాల్కొండ సెగ్మెంట్​కు చెందిన డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డిని స్టేట్​ కో -ఆపరేటివ్​ లిమిటెడ్​ చైర్మన్​గా అదే నియోజకవర్గానికి చెందిన బీసీ నేత ఈరవత్రి అనిల్​ను మినరల్​ ​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​గా అర్బన్​ సెగ్మెంట్​కు చెందిన తాహెర్​ను ఉర్దూ అకాడమీ చైర్మన్​గా నియమించింది.  

ఈ ముగ్గురు నేతలు పార్లమెంట్​ ఎన్నికలకు ముందు పదవులు పొందారు. కామారెడ్డిలో సీఎం రేవంత్​రెడ్డి కోసం నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా షబ్బీర్అలీని గవర్నమెంట్​ సలహాదారుడిగా క్యాబినేట్​ హోదాలో నియమించింది. అయితే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు స్టేట్​లో మంచి హోదాలోని నామినేటెడ్​ పదవిని ఆశిస్తున్నారు. దీని కోసం తన సమీప బంధువు మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావును ఆశ్రయించారు. తుమ్మల వల్లే  మండవ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్​ఎస్​ వీడి కాంగ్రెస్​లో చేరారు.  ​

మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, డి.రాజేశ్వర్​ కూడా పైరవీలు చేస్తున్నారు. వీరిలో ఆకుల లలిత ఢిల్లీ లెవల్​లో ప్రయత్నాలు చేస్తుండగా మిగితా ఇద్దరు సీఎం రేవంత్ ​రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టసభలకు ఎన్నికయ్యే చాన్స్​ సమీపంలో లేనందున నామినేటెడ్​ పదవులతో సరిపెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఆర్మూర్​, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వినయ్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి ఆయా సెగ్మెంట్​లకు పార్టీ ఇన్​ఛార్జ్​లుగా వ్యవహరిస్తున్నారు. 

ప్రొటోకాల్​ గొడవ రాకుండా ఉండడానికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్​ బెర్త్​లు ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడుగు గంగాధర్​ మిగితా నేతలందరికంటే రేస్​లో ముందున్నారు. 20 04 నుంచి 2014 దాకా రెండు విడతలు కాంగ్రెస్​ పార్టీ రూలింగ్​లో ఉన్నప్పుడు  గడుగుకు ఛాన్స్​ వచ్చినట్లే వచ్చి చేజారింది. టీపీసీసీ జనరల్​ సెక్రెటరీగా కొనసాగుతున్న తనను ఈసారైనా గుర్తించాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.

మార్కెట్​ కమిటీకి అంతే పోటీ 

ప్రతి ఏడాది రూ.2,300 కోట్ల ఉన్న టర్నోవర్​తో రూ.23 కోట్ల నెట్​ ఆమ్దానీ గల నిజామాబాద్​ అగ్చికల్చర్​ మార్కెట్​ పోస్టుకు  ఎనిమిది మంది నేతలు పోటీలో ఉన్నారు.   డిప్యూటీ మినిస్టర్  సమాన హోదాగల ఈ పదవిని దక్కించుకోవాలని అంతిరెడ్డి రాజిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, నరాల రత్నాకర్​, కేశవేణు, శేఖర్​గౌడ్​తో పాటు ఇంతకు ముందు ఒకసారి ఇదే కమిటీకి చైర్మన్​గా పనిచేసిన నగేశ్ రెడ్డి, కంచెట్టి గంగాధర్​, గజవాడ  జైపాల్​ రేస్​లో ఉన్నారు. ​ 

మంత్రివర్గంలో ఎవరు..?

సీఎం రేవంత్​రెడ్డి మొదటి విడత మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం లభించలేదు. పార్లమెంట్​ ఎన్నికలు ముగిసినందున రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై సీఎం ఫోకస్​ పెట్టినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఇందులో చాన్స్​ ఎవరికి దక్కబోతుందన్నది పాయింట్​ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలో మంత్రి ఉంటే నామినేటెడ్​ పదవులు లభించేలా  సిఫారసులు చేసుకోవడం ఈజీ అయ్యేదనే అభిప్రాయం చాలా మంది లీడర్లలో ఉంది.  ​మంత్రి వర్గంలో చోటు సంపాదించేందుకు సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు.