ప్రజలు నష్టపోకుండా చూడాలి

  • తప్పిదాలకు తావులేకుండా చూడాలి
  • నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తాం
  • బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బాల్కొండ,వెలుగు: జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం కాంగ్రెస్​ నాయకులు, అధికారులు పర్యటించారు.  మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  ఎస్సారెస్పీని సందర్శించారు. వరద గేట్లు పరిశీలించి,  వాటర్ లెవల్, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజల పరిస్థితులపై ఆరా తీశారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు  నష్టం వాటిళ్లకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి విడుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.  సాగు, తాగు నీటికోసం ఆందోళన ఉన్న తరుణంలో, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు.

ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో ప్రస్తుత ఖరీఫ్, వచ్చే యాసంగిలో పంటలకు సాగునీటికి ఢోకా ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు.  వర్షానికి కూలిన ఇళ్ల నిర్వాసితులను కాంగ్రెస్​ గవర్నమెంట్ ఆదుకుంటుందన్నారు. భీంగల్ మొగిలి చెరువును సందర్శించిన,  కాలనీవాసులతో మాట్లాడారు.   కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, గడుగు గంగాధర్, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా, ఈఈ చక్రపాణి పాల్గొన్నారు.