దేశ గర్వానికి ఖాదీ సూచిక: సోనియా గాంధీ

  • వాటితోనే జాతీయ జెండాలు తయారు చేయాలి
  • ఎంపీ సోనియా గాంధీ కామెంట్

న్యూఢిల్లీ: దేశ గర్వానికి ఖాదీ వస్త్రాలే సూచికని కాంగ్రెస్‌‌‌‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ (సీపీపీ) సోనియాగాంధీ అన్నారు. జాతీయ జెండాల తయారీలో ఖాదీ వస్త్రాలను మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నేషనల్ న్యూస్ పేపర్​కు ఆమె ఓ ఆర్టికల్ రాశారు. ఖాదీ వస్త్రాలపై ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని సోనియా  ఆరోపించారు. 

"స్వాతంత్య్ర దినోత్సవానికి వారం ముందు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం స్టార్ట్ చేశారు. ఇది మంచి విషయమే. జాతీయ జెండా ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కానీ జెండాను గౌరవించడంలో స్వయంగా మోదీనే ద్వంద్వ వైఖరి అమలు చేస్తున్నారు. ఓవైపు ఖాదీ జెండాలను తయారు చేసి కుదేలవుతున్న సంస్థలపై జాలి కురిపిస్తున్నారు. మరోవైపు చైనా, ఇతర ప్రాంతాల నుంచి పాలిస్టర్ జెండాలను దిగుమతి చేస్తున్నారు. 

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఖాదీ లేదా చరఖాతో తయారు చేసిన జాతీయ జెండాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ అలా జరగటంలేదు. ఖాదీ వస్త్రానికి దేశ చరిత్రలో, సాంస్కృతిక జ్ఞాపకాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఖాదీ మన గతానికి ప్రతీక. భారతీయ ఆధునికత, ఆర్థిక శక్తికి చిహ్నం. ఒకప్పుడు త్రివర్ణ పతాకంలోనూ చరఖా ఉండేది. దేశంలోని ఖాదీ కార్మికులు, నేతన్నల శ్రమకు గుర్తింపు, ప్రోత్సాహం ఉండేది. కాని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గతాన్ని పక్కన పడేసింది. భారీ మార్కెట్, మెషిన్-మేడ్ పాలిస్టర్ ఫాబ్రిక్‌‌‌‌ను ప్రోత్సహిస్తున్నది. అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తింపు పొందిన కర్నాటకలోని ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ (కేకేజీఎస్‌‌‌‌ఎస్) కార్మికులు నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఇది నిజంగా బాధాకరం. కేవలం ఖాదీతో తయారు చేసిన జెండాలను మాత్రమే దేశంలో ఎగరవేయాలని కోరుతున్నా" అని సోనియా గాంధీ పేర్కొన్నారు. 

చేనేత కార్మికులపై జీఎస్‌‌‌‌టీ భారం

జీఎస్‌‌‌‌టీ అనేది దేశంలోని చేనేత కార్మికులకు భారంగా మారిందని సోనియాగాంధీ తెలిపారు. తుది ఉత్పత్తితో పాటు నూలు, రంగులు, కెమికల్స్ వంటి ముడి పదార్థాలపై ట్యాక్స్ వేయటం దారుణమన్నారు. జీఎస్‌‌‌‌టీ నుంచి చేనేతలను మినహాయించాలని డిమాండ్ చేశారు.