బెంగళూరు: కర్నాటక రాజధాని నగరంలోని బెంగళూరు ప్రెస్క్లబ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కురుబర సంఘం ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో ఆయన స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయనను హుటాహుటిన ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా స్కామ్ నుంచి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించడంతో కర్నాటక కాంగ్రెస్ నేతలు బెంగళూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
CK Ravichandran, @INCKarnataka, Karnataka Backward Classes & Minorities Assn member died of cardiac arrest while addressing press conference at Press Club #Bengaluru opposing #Karnataka Guv @TCGEHLOT’s permission to prosecute CM @siddaramaiah. @TOIBengaluru #Health pic.twitter.com/zkCjdi5uma
— Niranjan Kaggere (@nkaggere) August 19, 2024
ఈ ప్రెస్ మీట్లో సీకే రవిచంద్రన్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన 48 సెకన్లలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కూర్చున్న కుర్చీలో నుంచి అమాంతం కిందపడిపోయారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) కూడా చెన్నైలో ఆదివారం రోజు ఇదే తరహాలో హార్ట్ అటాక్ రావడంతో ప్రాణాలు కోల్పోయారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రిసీవ్ చేసుకోవడానికి చెన్నై ఎయిర్ పోర్ట్కు వెళ్లిన రాకేశ్ పాల్ విమానాశ్రయంలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ప్రెస్మీట్లో సీకే రవిచంద్రన్ కూడా ఇలా చనిపోవడం.. ఈ వరుస హార్ట్ అటాక్ మరణాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇటీవల ఈ సడన్ హార్ట్ స్ట్రోక్ లు, సైలెంట్ హార్ట్ అటాక్ కేసులు పెరిగిపోతున్నాయి.
నిజానికి సైలెంట్ హార్ట్ఎటాక్ అనేది ‘సైలెంట్’ కానేకాదు. నార్మల్ హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు ఛాతి భాగంలో తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. వాళ్లని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. అదే ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడంతో పాటు మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగాఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌లో కనిపించవు. అందుకే, చాలామంది వీటిని తరచూ వచ్చే అసౌకర్యం అనుకోవాలో లేదా గుండెపోటు సంకేతం అనుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతారు. అందుకే, వెంటనే డాక్టర్ని కలవరు. దాంతో వాళ్లకి ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుంది.