బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోంది : బండి సంజయ్

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.  పార్టీలు ఈ విషయంలో ఆలోచన చేయాలన్నారు.  కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే నిధులిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట నిధులు ఇవ్వడం లేదంటూ సంజయ్ ఆరోపించారు.  

కేంద్రం కూడా కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులిస్తామంటే  కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. తమ మంచితనాన్ని చేతగాని తనంగా భావించడం సరికాదని సంజయ్ హితువు పలికారు.  నిధులీయకుండా అవమానానికి గురిచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమైందో చూసారు. అలాంటి గతి కాంగ్రెస్ పట్టకుండా చూసుకోవాలని చెప్పారు.  

జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ చెబితే అది ఆయన ఆలోచన అని చెప్పారు.  తమ ఆలోచనను పార్టీ అధినాయకత్వం అంతా కలిసి ఆలోచిస్తుందన్నారు సంజయ్.  ఇక వరల్డ్ కప్ టీ-20లో భారత్ విజయంతో 140 కోట్ల భారతీయలు పులకించిపోయారని చెప్పారు సంజయ్.  క్రికెట్ లో భారత్ గెలవాలని అనేక మంది కోరుకున్నారని..   మనదేశీయులు కానివాళ్లు కూడా భారత్ గెలుపు కోసం ప్రార్థించారని వెల్లడించారు.  కష్టపడి కప్ సాధించిన భారత బృందానికి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.