బీసీకే పీసీసీ కాంగ్రెస్.. రేసులో మధుయాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్

  • రేసులో మధుయాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్ 
  • నేడో రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన
  • మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ 
  • ఖాళీగా ఉన్న ఆరింటిలో నాలుగు బెర్తులే భర్తీ  
  • వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి చాన్స్ 
  • మరో రెండు బెర్తులకు నలుగురి పేర్లు పరిశీలన
  • ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ

హైదరాబాద్, వెలుగు : బీసీ వర్గానికే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్​లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన భేటీలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చ జరిగింది. మళ్లీ సాయంత్రం కేసీ వేణుగోపాల్​తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ పదవి బీసీలకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారని సమాచారం. 

చాన్స్​ ఎవరికో?

బీసీ వర్గం నుంచి పీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా ఇద్దరు నేతలు ఉన్నారు. ఈ పదవి కోసం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ హైకమాండ్ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధుయాష్కీ విషయంలో రాహుల్ సానుకూలంగా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేశ్ కుమార్ గౌడ్ పేరును సిఫారసు చేసినట్టు తెలిసింది. ఇక భట్టి, ఉత్తమ్ ఎవరి వైపు మొగ్గు చూపారనేది క్లారిటీ లేకున్నా.. మధుయాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్ లలో ఒకరిని పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.

కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై వివిధ సామాజిక వర్గాల వారీగా చర్చ జరిగింది. ఎస్టీలో లంబాడ, ఎస్సీలో మాదిగ, బీసీ.. ఇలా సామాజిక వర్గాల వారీగా చర్చించారు. అయితే రాత్రి వరకు మాత్రం బీసీకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై శనివారం లేదా ఆదివారం ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మంత్రివర్గ బెర్తులపై నేడు క్లారిటీ.. 

మీటింగ్​లో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం కేబినెట్ లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా, అందులో నాలుగింటిని మాత్రమే భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్లపై స్పష్టత వచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మరో రెండు బెర్తులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,  రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గ బెర్తులపై శనివారం ఓ క్లారిటీ రానుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, వరంగల్ లో రాహుల్ సభ, రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల  తేదీలు ఇంకా ఖరారు కాలేదని సమాచారం.