కొండగట్టు మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌ రెడీ

  •    రూ. 230 కోట్లతో అభివృద్ధి పనుల ప్రణాళిక రూపొందించిన ఆఫీసర్లు
  •     రాజగోపురాలు, భక్తులు, వీఐపీల వసతి గదుల నిర్మాణానికి చర్యలు
  •     పనుల వివరాలను ఉన్నతాధికారులకు అందజేసిన ఆలయ ఆఫీసర్లు
  •     ప్రభుత్వం నుంచి పర్మిషన్‌‌‌‌ రాగానే పనులు మొదలుపెట్టేలా ప్లాన్‌‌‌‌

 జగిత్యాల, వెలుగు : ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కొండగట్టు అభివృద్ధి పనులు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ అధికారంలోకి రాగానే కొండగట్టు అభివృద్ధి పనులపై ఫోకస్‌‌‌‌ చేసింది. ఇందులో భాగంగా గతంలో రూపొందించిన మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌కు మరిన్ని మార్పులు చేసి కొత్త ప్లాన్‌‌‌‌ అమలుకు చర్యలు చేపట్టింది. దీంతో స్థానిక ఎండోమెంట్‌‌‌‌ ఆఫీసర్లు ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.

రూ. 230 కోట్లతో మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండడంతో మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ ఈవో, ప్రధాన అర్చకుడు, స్థపతి, ఎండోమెంట్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ ఆఫీసర్లు మొత్తం 8 మందితో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు రూ. 230 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌ రూపొందించారు. ఇందులో భాగంగా స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంతో పాటు విమానగోపురానికి రూ. 50 కోట్లు, స్వామి వారి నూతన ప్రాకారం, గుడి నాలుగు వైపులా రాజగోపురాలకు రూ. 12 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 

అలాగే భక్తుల సౌకర్యార్థం 100 గదుల నిర్మాణానికి రూ. 40 కోట్లు, 50 వీఐపీ రూమ్స్‌‌‌‌ నిర్మాణానికి రూ. 50 కోట్లు, దీక్ష విరమణ మండప నిర్మాణం, మెట్ల దారి అభివృద్ధి, ఆలయానికి నీటి సరఫరా, అర్చకుల వసతి గృహాలకు రూ. 5 కోట్ల చొప్పున, ప్రత్యేక దర్శనం క్యూ కాంప్లెక్స్‌‌‌‌ నిర్మాణం కోసం రూ. 3 కోట్లతో మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ తయారు చేశారు. వీటితో పాటు మరో 27 రకాల పనులు చేప్టటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అభివృద్ధి పనుల నివేదికను ఈ నెల 13న స్టేట్‌‌‌‌ ఎండోమెంట్‌‌‌‌ ఆఫీసర్లకు అందజేశారు. ఎండోమెంట్ కమిషనర్‌‌‌‌ అప్రూవల్‌‌‌‌ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి బడ్జెట్‌‌‌‌ మంజూరు కాగానే టెండర్ల ద్వారా పనులు మొదలుకానున్నాయి.

హామీలకే పరిమితమైన గత సర్కార్‌‌‌‌

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన కొండగట్టుకు ఏటా సుమారు రూ. 20 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తామని గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. కానీ నిధులు మంజూరు కాకపోవడం, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అంజన్న పెద్ద జయంతి, చిన్న జయంతి వేడుకల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

భక్తుల, మాలధారుల ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో ఇచ్చిన హామీ మేరకు కొండగట్టు మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ అమలు చర్యలు చేపట్టారు. సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న పనులకు ఎట్టకేలకు మోక్షం కలుగుతుండడంతో భక్తులు, మాలదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రణాళిక సిద్ధం చేశాం 

కొండగట్టు అభివృద్ధి కోసం మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ సిద్ధం చేశాం. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌కు అందజేశాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- రామకృష్ణారావు, ఈవో కొండగట్టు