పాలమూరుకు టాస్క్ .. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచే క్లాసులు

  • త్వరలో స్కిల్​ డెవలప్​మెంట్​ వర్సిటీగా మార్చే అవకాశం​
  • మార్కెట్​ బిల్డింగ్  కేటాయించడంపై దృష్టి

మహబూబ్​నగర్, వెలుగు: వలసలకు కేరాఫ్​గా మారిన ఉమ్మడి పాలమూరు జిల్లాపై  రాష్ట్ర​సర్కారు స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఇక్కడి యూత్​కు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్​ అండ్​ నాలెడ్జ్) మంజూరు చేసింది. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి క్లాసులు ప్రారంభించనుంది. టాస్క్​ ఏర్పాటుతో డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్​ పూర్తి చేసిన స్టూడెంట్లకు ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

రాష్ట్రంలో రెండోది..

2014లో తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్​ అండ్​ నాలెడ్జ్​ ఏర్పాటైంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ​సెంటర్​ను ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు తన సొంత జిల్లా అయిన పెద్దపల్లికి సెంటర్​ను మంజూరు చేయించారు. మహబూబ్​నగర్​కు కూడా టాస్క్​ సెంటర్​ మంజూరు చేయాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి కొద్ది రోజులుగా పట్టుబట్టడంతో మంత్రి ఆమోదం తెలిపారు. మంగళవారం ఈ సెంటర్​ ఏర్పాటుకు అనుమతులు జారీ అయ్యాయి.

ఈ సెంటర్​కు దాదాపు రూ.20 కోట్లు అవసరం ఉండగా, ఆర్అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి న్యాక్​ ద్వారా నిధులను కేటాయించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ సెంటర్​ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాత్కాలికంగా రెండు క్లాస్​ రూమ్స్, రెండు ల్యాబ్స్​ ప్రైవేట్​ బిల్డింగుల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం హైదరాబాద్​లోని మసాబ్​ ట్యాంక్​ వద్ద ఉన్న టాస్క్​ సెంటర్​ను సందర్శించి, అక్కడి ల్యాబ్, క్లాస్​ రూమ్స్​ తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఇదే తరహాలో పాలమూరులో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

29 కాలేజీలే రిజిస్ట్రేషన్..​

గత ప్రభుత్వ హయాంలో టాస్క్​లో కేవలం ఉమ్మడి జిల్లాలోని 15 డిగ్రీ కాలేజీలు, ఆరు పీజీ కాలేజీలు, ఏడు పాలిటెక్నిక్​ కాలేజీలు, ఒక ఫార్మా కాలేజీ మాత్రమే రిజిస్ట్రేషన్​ చేసుకున్నాయి. అందులో పాలమూరు జిల్లాలో 12 కాలేజీలు, నాగర్​కర్నూల్​ జిల్లాలో ఏడు, గద్వాలలో మూడు, వనపర్తిలో ఏడు కాలేజీలున్నాయి. టాస్క్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవడం వల్ల ఈ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి స్కిల్ అండ్​ నాలెడ్జ్​పై శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే వారు. ప్రస్తుతం ఈ సెంటర్​ను మహబూబ్​నగర్  జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్​ ఏర్పాటు వల్ల జిల్లాలో ఏటా  ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్​, ఐటీఐ పూర్తి చేసే 25 వేల మంది స్టూడెంట్లకు మేలు కలుగుతుంది. స్కిల్​ అండ్​ నాలెడ్జ్ పై శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.

మార్కెట్​ బిల్డింగ్​ కేటాయించడంపై నజర్​..

గత ప్రభుత్వం 2018లో జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న డైట్​ కాలేజీకి చెందిన స్థలాన్ని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణానికి కేటాయించింది. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్లు అప్పట్లో ఆందోళనకు దిగారు. కాలేజ్​ స్థలాన్ని మార్కెట్ కు కేటాయించవద్దని, విద్యాభివృద్ది కోసం వినియోగించాలని ధర్నా చేశారు. కానీ, ఈ విషయాన్ని అప్పట్లో మంత్రిగా ఉన్న శ్రీనివాస్​గౌడ్ పట్టించుకోలేదు. దాదాపు ఆరేండ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు.

అయితే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి మార్కెట్​ కోసం కట్టించిన ఈ భవనాన్ని ‘టాస్క్’కు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ప్రారంభమయ్యే ఈ సెంటర్​ను త్వరలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ‘టాస్క్’ యూనివర్సిటీగా డెవలప్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భవనం జిల్లా కేంద్రానికి నడిబొడ్డులో ఉండడం, వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైలు మార్గంలో వచ్చే స్టూడెంట్లకు అనువుగా ఉండడంతో ఉన్నతాధికారులు, జిల్లా, ఇన్​చార్జి మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

స్కిల్​ డెవలప్​మెంట్​ వర్సిటీ ఏర్పాటు చేస్తాం..

పాలమూరులో టాస్క్​ ద్వారా స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్  ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు ఐదారు వేల మంది స్టూడెంట్లకు ఇందులో శిక్షణ ఇప్పిస్తాం. తర్వాత యూనివర్సిటీగా అప్​గ్రేడ్​ చేస్తాం. రాష్ట్రంలో స్కిల్​ డెవలప్​మెంట్​ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ మేనిఫెస్టోలో కూడా ఉంది. యూనివర్సిటీ ఏర్పాటైతే పర్మినెంట్​ బిల్డింగ్​ అవసరం ఉండండంతో, డైట్​ కాలేజీ వద్ద ఉన్న బిల్డింగ్​ను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. 

యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే​