చిగురిస్తున్న ఆశలు..పెండింగ్​ ఎల్ఆర్​ఎస్​ అర్జీల క్లియరెన్స్​కు సర్కార్​ రెడీ

  •     ఉమ్మడి జిల్లాలో 1,91,499 మంది దరఖాస్తులు
  •     ఆర్జీలు తీసుకొని మూలన పడేసిన గత బీఆర్​ఎస్​ సర్కారు
  •     మూడేండ్ల నుంచి అమ్మకాలు నిలిచిపోవడంతో అవస్థలు

నిజామాబాద్​, వెలుగు: నాన్ ​లేఅవుట్​ ఇండ్ల జాగాల రెగ్యులైజేషన్​(ఎల్​ఆర్​ఎస్​)ను పూర్తిచేయడానికి కాంగ్రెస్​ గవర్నమెంట్​ గైడ్​లైన్స్​ రూపొందిస్తుడడంతో ఉమ్మడి జిల్లా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులు తీసుకొని మూడేండ్ల పాటు పెండింగ్​లో పెట్టింది. నాన్​ లేఅవుట్​ ప్లాట్ల​ రిజిస్ట్రేషన్​ ఆగిపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు.

ఆన్​లైన్​ దరఖాస్తులతో రూ.19 కోట్ల వసూలు

2020, అక్టోబర్​లో టౌన్​ ఏరియాల్లో నాన్​ లేఅవుట్​ ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు దరఖాస్తులు ఆహ్వానించగా నిజామాబాద్​ జిల్లా మున్సిపాలిటీలు, నుడా పరిధిలోని గ్రామాలతో కలిపి 57,311అర్జీలు, కామారెడ్డి జిల్లాలో 20,459 అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ఫీజు వసూలు చేయగా రూ.7.77 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దీని తర్వాత టౌన్​ల మాదిరే గ్రామాల్లోని నాన్​ లేఅవుట్ ​ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఆర్జీలు ఆహ్వానించారు. 

ఉమ్మడి జిల్లాలో 1,13,729 దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో రూ.వెయ్యి, రెండో విడతలో రూ.పది వేలు ఫీజు తీసుకున్నారు. దీంతో  రూ.11.37 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. నాన్ ​లేఅవుట్​ ఇండ్ల జాగాల్లో నిర్మాణాలకు పర్మిషన్​ ఇవ్వొద్దని, అమ్మకాలను అనుమతించొద్దని గత ప్రభుత్వం ఆర్డర్స్​ ఇవ్వడంతో భయపడి 90 శాతం మంది ప్లాట్ల ఓనర్లు రెగ్యులరైజేషన్​కు దరఖాస్తులు పెట్టుకున్నారు.

కాంగ్రెస్​ సర్కార్​తో కదలిక

గత సర్కార్​ ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లను మూడేండ్ల పాటు పెండింగ్​లో పెట్టడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ గవర్నమెంట్ ​తాజాగా ఈ ఇష్యూను సెటిల్​ చేయాలని నిర్ణయం తీసుకుంది. సర్కారుకు ఇన్​కమ్​ రావడంతో పాటు వేలాది మందికి మేలు జరిగే ఎల్​ఆర్​ఎస్​ రెగ్యులరైజేషన్​​కు పాలకులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పెనాల్టీతో నిర్మాణ పర్మిషన్లు
 
తమ నాన్​ లేఅవుట్​ ప్లాట్​లో ఇండ్లు కట్టుకునేందుకు మున్సిపాలిటీలు పెనాల్టీలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చాయి. కానీ అమ్మకాలు మాత్రం నిలిచిపోయాయి. రిజస్ట్రేషన్ ​కానీ ఇలాంటి ప్లాట్స్​ను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎల్​ఆర్​ఎస్​ పేరుతో దరఖాస్తులు తీసుకున్న గవర్నమెంట్​ తర్వాత స్పష్టమైన విధివిధానాలు రూపొందించకుండా ఆ ఇష్యూను పెండింగ్​లో పెట్టింది.