‘నామినేటెడ్​’ సందడి

  • కొలువుదీరునున్న 
  • మార్కెట్​ కమిటీ పాలక వర్గాలు
  • అక్టోబరులోపు అన్ని పదవులు భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్​ సర్కారు
  • లోకల్​ బాడీస్​ ఎన్నికలే టార్గెట్​గా చైర్మన్ల నియామకాలు 

మహబూబ్​నగర్​, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ సర్కారు జిల్లాల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్​ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. దీంతో  గ్రామాల్లో పార్టీ బలోపేతం అవుతుందని బలంగా విశ్వసిస్తోంది.  ఇప్పటికే కొన్ని చోట్ల చైర్​పర్సన్​ల  నియామకాలు జరగ్గా..  పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల పలు అంశాలను బేరీజు వేసుకుని పదవులు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోనుంది. దసరాలోపు అన్ని రకాల పదవులను భర్తీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం రెడీ అవుతోంది.  

చకాచకా మార్కెట్ కమిటీల ఏర్పాటు 

మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్​జిల్లాల్లో పాలమూరు, దేవరకద్ర, నవాబుపేట, జడ్చర్ల, మక్తల్​, నారాయణపేట, కోస్గి, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్​, నాగర్​కర్నూల్​లో వ్యవసాయ మార్కెట్​ యార్డులున్నాయి. ప్రభుత్వం మారడంతో ఈ యార్డుల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఇటీవల పాలమూరు, నారాయణపేట, అచ్చంపేట  మార్కెట్​ కమిటీల పాలక వర్గాలు ఏర్పాటు కాగా..  చైర్ పర్సన్​గా బెక్కరి అనిత, సదాశివరెడ్డి, అంతటి రజిత ప్రమాణ స్వీకారం చేశారు.

 గత నెల దేవరకద్ర మార్కెట్​ కమిటీ చైర్మన్​గా కథలప్పను ప్రకటించగా.. ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. జడ్చర్ల మార్కెట్​ చైర్మన్​గా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన అల్వాల్​ రెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా.. వారం, పది రోజుల్లో ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మక్తల్ మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఇప్పటికే గవినోళ్ల లక్ష్మారెడ్డి పేరు ఖరారైనట్లు తెలిసింది. కోస్గిలో పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ చైర్మన్​ పదవి కోసం సింగ నరసింహ, పెద్ద నరసింహ, బాలరాజు, హనుమాన్​పల్లి రామకృష్ణ మధ్య పోటీ నెలకొంది.  నాగర్​కర్నూల్​, నవాబుపేట, కొల్లాపూర్​, కల్వకుర్తి కమిటీలను ఇంకా ఫైనల్​ చేయాల్సి ఉంది. 

రెండు నెలల్లో కొత్త వారికి డీసీసీల బాధ్యతలు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023లో జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్​ హైకమాండ్​ నియమించింది.  వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం వీరికే అధ్యక్ష బాధ్యతలు ఉండటంతో అదనపు బాధ్యతలు చేపట్టలేకపోతున్నారు. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో కొత్త వారికి డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీ భావిస్తోంది. రానున్న ఒకటి, రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. మహబూబ్​నగర్ డీసీసీ కోసం ఎన్​పీ వెంకటేశ్, సంజీవ్​ ముదిరాజ్​, ఎస్. వినోద్​కుమార్​, రాధా అమర్​, జహీర్​ అక్తార్​, సిరాజ్​ ఖాద్రి, మధుసూదన్​ రెడ్డి, నారాయణపేట డీసీసీ కోసం కుంభం శివకుమార్​ రెడ్డి, నాగర్​కర్నూల్​ డీసీసీ కోసం బాలాజీ సింగ్, కేవీఎన్ రెడ్డి పోటీ పడుతున్నారు.

డీసీసీలే కాకుండా.. గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పోస్టులకు గిరాకీ పెరిగింది. మహబూబ్​నగర్​ గ్రంథాలయ సంస్థ చైర్మన్​గా గత నెల నర్సింహా రెడ్డిని ఎంపిక చేశారు. నారాయణపేట జిల్లాలో ఈ చైర్మన్​ బండి వేణుగోపాల్, సంగంబండ గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి మధ్య పోటీ ఉండగా.. నాగర్​కర్నూల్​ జిల్లాలో అచ్చంపేటకు చెందిన అడ్వకేట్ రాజేందర్ పేరు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆలయ కమిటీలకు పేర్లను ఫైనల్​ చేశారు.  కురుమూర్తి ఆలయ చైర్మన్​ పదవికి గోవర్ధన్​ రెడ్డి పేరును ఫైనల్ చేయగా..  ఇంకా పాలక వర్గం కొలువుదీరాల్సి ఉంది. నవాబుపేటలోని మైసమ్మ టెంపుల్​ ఆలయ కమిటీ చైర్మన్​ పదవి కోసం జగన్​మెహన్​ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాలోని మూడు ప్రముఖ ఆలయాల చైర్మన్​ పోస్టుల కోసం పోటీ నెలకొనడంతో ఇంకా ఎవరినీ ఫైనల్​ చేయలేదు. 

'ముడా' చైర్మన్​ గిరి ఎవరికో?

మహబూబ్​నగర్​ అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) చైర్మన్​ పదవికి మస్తు డిమాండ్​ ఏర్పడంది. పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్​ మున్సిపాల్టీల పరిధిలోని దాదాపు 140 గ్రామాలు దీని పరిధిలో ఉండటంతో ఈ చైర్మన్​ స్థానాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేల వద్ద కొందరు లీడర్లు తమకు ముడా చైర్మన్​పదవి ఇవ్వాలనే డిమాండ్​ వినిపిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి నెలకొన్నది. గతంలో ఈ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించగా.. ఈసారి ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది.