నిజామాబాద్ జిల్లాలో డబుల్​బెడ్రూం ఇండ్లపై ఫోకస్

  • జిల్లాలో రెడీగా 1,620 ఇండ్లు
  • దరఖాస్తుల స్వీకరణ షురూ
  • అసంపూర్తి నిర్మాణాలపై  గుత్తేదార్లతో చర్చలు

నిజామాబాద్,  వెలుగు: జిల్లాలో డబుల్​బెడ్ రూం ఇండ్ల అంశంలో కదలిక మొదలైంది. గత బీఆర్​ఎస్​ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఊరించింది. అయితే   కాంగ్రెస్​ సర్కారు పంపిణీ చేసేందుకు డిసైడైంది. తుదిదశలో ఉన్న ఇండ్లను అర్హులకు అందించడంతో పాటు  అసంపూర్తి గా ఉన్న ఇండ్లను పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.  జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, హౌసింగ్​మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఈనెల జిల్లాలో నిర్వహించిన సమీక్ష తరువాత అధికారులు ఈ అంశానికి ప్రయారిటీ ఇస్తున్నారు. 

మొత్తం5,300 ఇండ్లు మంజూరు

బీఆర్​ఎస్ ప్రభుత్వం​ పదేండ్ల కాలంలో విడతల వారీగా జిల్లాకు 15,350 డబుల్​ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. టెండర్​ విధానంలో నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించగా, రేట్​ గిట్టుబాటు కాదని మొదట్లో వెనక్కు వెళ్లారు. మంజీరా నుంచి సీనరేజ్​చార్జ్​లేకుండా ఫ్రీగా ఇసుక తోలుకునే వెసులుబాటు ఇవ్వడంతో సుమారు 3,700 ఇండ్లు పూర్తయ్యాయి. అందులో 2,120 ఇండ్లను పంపిణీ చేసి 1,580 పెండింగ్​లో పెట్టాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేలు వేలాది దరఖాస్తులు తీసుకొని వదిలేశారు. 

పంపిణీ చేయనందున పూర్తయిన ఇండ్ల కేటాయింపులకు ముందే శిథిలమయ్యాయి. దొంగలు కిటికీలు, డోర్లు ఎత్తుకెళ్లారు. నిజామాబాద్​లోని​ నగరంలోని నాగారంలో 400 ఇండ్లు, న్యూ కలెక్టరేట్​పక్కన మంజూరైన 400 ఇండ్లలో పూర్తయిన వంద ఇండ్లు,  బోధన్​లోని 450, బాల్కొండ, ఆర్మూర్, రూరల్​సెగ్మెంట్లలో 630 ఇండ్లు కేటాయింపులకు ముందే పాడయ్యాయి. వాటిలో మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రస్తుత  ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. 

నివాస యోగ్యంగా ఆ ఇండ్లను మలిచి అర్హులకు అప్పగించాలని మంత్రులు ఆదేశించడంతో పనులు ప్రారంభమయ్యాయి.  మరో పక్క లబ్ధిదారుల ఎంపిక ​కోసం తహసీల్దార్లు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించనున్నారు. 

అసంపూర్తి ఇండ్లపై దృష్టి

జిల్లాకు మంజూరైన 15,300 ఇండ్లలో జీ+1లో 3,700 పూర్తికాగా సొంత జాగాలున్న వారికి 4  వేల ఇండ్లు మంజూరు చేశారు.  మిగతా 7,700 ఇండ్లలో 3,400 అసంపూర్తిగా ఉండగా,  4,300 ఇండ్లు ఇంకా మొదలు పెట్టనేలేదు. అసలు స్టార్ట్​ కాని ఇండ్లను పక్కనబెట్టి మధ్యలో నిలిచిపోయిన ఇండ్లను రెండు, మూడు నెలలలో పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలివ్వడంతో ఆఫీసర్లు కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నారు.

 తమ నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నారు. మంజీరా నుంచి ఇసుకను ఉచితంగా తరలించుకునేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఇలా నగరంలోని ధర్మపురి హిల్స్​లో 400, న్యూకలెక్టరేట్​ వద్ద అసంపూర్తిగా ఉన్న 300 ఇండ్లు, నాగారం వద్ద మరో కాలనీలో పిల్లర్ల స్టేజీలో వదిలేసిన 400 గృహాలు, విలేజ్​లలో జీ+1 తరహాలో నిలిచిపోయిన ఇండ్లు పూర్తి  చేయనున్నారు.