అంచనా వ్యయం పెరిగితే.. ఆయకట్టు ఎందుకు తగ్గినట్టు ?

  • బీఆర్ఎస్​ హయాంలో జరిగిన దేవాదుల లిఫ్ట్‌‌ స్కీం పనులపై కాంగ్రెస్​ సర్కారు ఫోకస్
  • రూ.9 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు అంచనాలు పెంచిన కేసీఆర్​ సర్కారు
  • ఆయకట్టును మాత్రం 6.21 లక్షల ఎకరాల నుంచి 3.80 లక్షల ఎకరాలకు కుదింపు
  • పదేండ్ల పాటు పెండింగ్​ పడ్డ ప్రాజెక్ట్‌‌ పనులను స్పీడప్​ చేసిన కాంగ్రెస్​ప్రభుత్వం
  • దేవాదులపై నేడు ఇరిగేషన్‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి సమీక్ష

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : దేవాదుల లిఫ్ట్‌‌ స్కీమ్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ సర్కారు ఫోకస్‌‌‌‌ పెట్టింది. వచ్చే ఏడాది మార్చి కల్లా పెండింగ్‌‌‌‌ పనులు పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీళ్లిచ్చే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అదే సమయంలో గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో జరిగిన అవకతవకలపైనా ఆరా తీస్తోంది. ప్రధానంగా గడిచిన పదేండ్లలో చేపట్టిన పనుల్లో  భారీగా అంచనా వ్యయం పెరగడం, అదే సమయంలో ఆయకట్టును తగ్గించాలనే కేసీఆర్‌‌‌‌ సర్కారు నిర్ణయం వెనుక కారణాలను అన్వేషిస్తోంది. 

నీటిని లిఫ్టు చేయకుండా, కాల్వలు తవ్వకుండా, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయకుండా రూ.5 వేల కోట్లకు పైగా అంచనా వ్యయాన్ని పెంచి 2.41 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గించడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఆఫీసర్లను ఇప్పటికే నివేదిక కోరినట్లు  తెలిసింది. ఈ క్రమంలో నేడు (శుక్రవారం) దేవాదుల దగ్గర మరో ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ధనసరి సీతక్కతో కలిసి ప్రాజెక్ట్‌‌ ఇంజినీర్లతో మంత్రి ఉత్తమ్​ రివ్యూ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. 

భారీగా పెరిగిన అంచనా వ్యయం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 38.5 టీఎంసీల నీటిని లిఫ్టు చేసి 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. వైఎస్సార్​పీరియడ్‌‌‌‌లో పనులు చకాచకా జరిగాయి. 

దేవాదుల మొదటి, రెండో దశ మెయిన్‌‌ వర్క్‌‌‌‌లు కంప్లీట్‌‌‌‌ అయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఈ స్కీంను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2004లో రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్‌‌‌‌ పనులు ప్రారంభించగా, 2010 నాటికి రూ.9,427.73 కోట్లకు, ఆ తర్వాత 2016 నాటికి రూ.13,445.44 కోట్లకు పెంచారు. అప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో 2022లో మూడోసారి అంచనా వ్యయాన్ని రూ.14,729 కోట్లకు పెంచారు.

 బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌ అధికారంలోకి వచ్చాక  మరోసారి అంచనా వ్యయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచినా పనులు మాత్రం కంప్లీట్‌‌‌‌ చేయలేదు. లిఫ్టింగ్​కెపాసిటీని 38.5 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచినా ఏనాడూ 8 టీఎంసీలకు మించి నీళ్లు ఎత్తిపోయలేదు.

పదేళ్లయినా థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ పనులు పూర్తికాలే !

దేవాదుల  ద్వారా ఉమ్మడి వరంగల్‌‌‌‌, నల్గొండ, కరీంనగర్‌‌‌‌ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా వీటిలో 5.57 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా, 64 వేల ఎకరాలకు చెరువుల ద్వారా సాగునీరందించాలి. వైఎస్సార్​హయాంలో ఫస్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌, సెకండ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ మేజర్‌‌‌‌ వర్క్‌‌‌‌లు పూర్తయ్యాయి. ధర్మసాగర్‌‌‌‌, నర్సింగపూర్‌‌‌‌, ఆర్‌‌ఎస్‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, ఆశ్వరావుపల్లి, చీటకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌‌‌‌పల్లి రిజర్వాయర్లను నిర్మించారు. 2008 నుంచి 2014 వరకు ఫేజ్‌‌‌‌‒1, ఫేజ్‌‌‌‌ 2 ద్వారా వాటర్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ చేసి 70 వేల ఎకరాలకు పైగా సాగునీరందించారు. 

కానీ 2014 నుంచి బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న పదేళ్లలో థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ పనులను కంప్లీట్‌‌‌‌ చేయలేకపోయారు. పంట పొలాలకు సాగునీరందించే మెయిన్​,   మైనర్‌‌‌‌ కెనాల్స్‌‌‌‌ పనులు పూర్తిచేయలేదు. 2018‒19లో 2.90 లక్షల ఎకరాలు, 2019‒20లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని ప్రకటించినా 2023 నాటికి కూడా పనులు పూర్తికాలేదు. ఏటా 40 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని ఎగువకు పంపింగ్‌‌‌‌ చేసే థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ పనులు పూర్తికాకపోవడం వల్ల కేవలం 1.56 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే స్థిరీకరించగలిగారు. 

2.41 లక్షల ఎకరాల కుదింపు

పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా  దేవాదుల పనులను పూర్తిచేయని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు ఈ స్కీం పరిధిలో ని 2.41 లక్షల ఎకరాలను కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ కిందికి మళ్లించింది. 2008 నుంచే దేవాదుల ద్వారా నీళ్లందిస్తున్న తపాస్‌‌‌‌ పల్లి, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్దనూరు రిజర్వాయర్ల కింద 1.38 లక్షల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌‌ ద్వారా, అశ్వరావుపల్లి, చీటకోడూరు, నవాబ్‌‌‌‌పేట  రిజర్వాయర్ల కింద ఉన్న 

1.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు గంధమల్ల కెనాల్‌‌‌‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ నీళ్లు అందిస్తామని ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ క్రమంలోనే దేవాదుల ఆయకట్టును 6.21 లక్షల ఎకరాల నుంచి 3.80 లక్షల ఎకరాలకు కుదించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఫండ్స్​కేటాయించింది. కానీ కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు పెండింగ్​పడడంతో ఈ ప్రతిపాదనలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

దేవాదులపై నేడు మంత్రుల రివ్యూ

మొదటి ప్రాధాన్యత కింద 2025 మార్చి నాటికి  దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు, తద్వారా మరో 89,312 ఎకరాల అదనపు ఆయకట్టును సాగులోకి తేవాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఫేజ్​3 పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే మూడుదశల్లో కలిపి 91శాతం భూసేకరణ పూర్తికాగా, మిగిలిన 2, 947 ఎకరాల భూసేకరణకు సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్ ఇచ్చింది. స్కీములో భాగంగా ప్రస్తుతం 20 పంపు హౌస్‌‌ల నిర్మాణం పూర్తికాగా, 5 కొత్త చెరువుల నిర్మాణంతో  పాటు 9 చెరువుల పునరుద్ధరణ చేపట్టడం విశేషం.  

ఈ క్రమంలో పనుల పురోగతికి సంబంధించి  నేడు (శుక్రవారం) ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఇన్‌‌టేక్​వెల్​దగ్గర నీటిపారుదల మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి.. వరంగల్​జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, జిల్లా మంత్రి సీతక్కతో కలిసి ఇరిగేషన్‌‌ ఆఫీసర్లతో రివ్యూ చేయనున్నారు. అంతకుముందు దేవాదుల స్కీం కోసం నిర్మించిన సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీ సైతం సందర్శిస్తారు. కాగా, మంత్రుల పర్యటన కోసం  ములుగు జిల్లా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.