రుణమాఫీకి.. సెల్పీ ఫొటో 

  • మాఫీ కాని రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ స్పీడప్
  • ప్రత్యేక యాప్​లో అప్​లోడ్ చేస్తున్న వ్యవసాయ అధికారులు 
  • వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్న రైతులు
  • ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం పూర్తి

ఆదిలాబాద్, వెలుగు : రైతు రుణమాఫీని కాంగ్రెస్​ ప్రభుత్వం మూడు విడతల్లో పూర్తి చేసింది. తొలి విడతలో జూలై 18న రూ.లక్ష, రెండో విడతలో భాగంగా జూలై 30న రూ.1.50 లక్షలు, మూడో విడతలో ఆగస్టు15న రూ.2 లక్షల రుణాలను మాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ. 17,870 కోట్లు మాఫీ చేయగా.. ఆదిలాబాద్ జిల్లాలో రూ. 623 కోట్లు మాఫీ అయ్యాయి.

అయితే ఈ మూడు విడతల్లో వివిధ కారణాలతో చాలా మంది రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ కాలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, బ్యాంకర్ల తప్పిదాలతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు రుణమాఫీ కాని రైతుల నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. ఇప్పుడు ఆ కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేపట్టారు.  

సెల్పీ దిగాల్సిందే..

రుణమాఫీ కానివారంతా సెల్ఫీ దిగాల్సిందే. ఆ ఫొటోనే రుణమాఫీ కాని రైతులను నిర్ధారించ నుంది. 4వ విడత రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. ఆ ప్రక్రియలో భాగంగా మాఫీ కాని రైతుల వివరాలను ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ముందుగా కుటుంబ నిర్ధారణ జరగని రైతుల జాబితాను వ్యవసాయ శాఖ బ్యాంకర్ల నుంచి సేకరించి ఏవోలకు అందించి ప్రక్రియ చేపట్టింది.

ఇందులో మొదట రైతు కుటుంబ సభ్యులంతా కలిసి ఓ సెల్ఫీ (ఫ్యామిలీ గ్రూపింగ్) ఫొటో దిగి ఆ తర్వాత వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రుణమాఫీ యాప్​లో అప్​లోడ్ చేస్తున్నారు. అలాగే రైతుల కుటుంబసభ్యుల వివరాలతో కూడిన అఫిడవిట్​ను అధికారులు వారి నుంచి తీసుకుంటున్నారు. ఈ సెల్ఫీలో కుటుంబ సభ్యులంతా తప్పక ఉండాలి. లేకపోతే కనీసం కుటుంబ పెద్ద అయినా ఉండాలనే నిబంధనలున్నాయి. దీంతో స్థానికంగా లేని చాలా మంది రైతులు ఇప్పుడు గ్రామాల బాట పట్టారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాతాల నుంచి సొంత గ్రామాలకు చేరుకొని సెల్ఫీలు తీసుకొని అప్​లోడ్ ​చేస్తున్నారు.

రాష్ట్రంలోనే మొదటిస్థానంలో!

ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 90 శాతం కుటుంబ నిర్ధారణ జరినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 16,648 దరఖాస్తులు రాగా అందులో 12 వేలకు పైగా దరఖాస్తుల వివరాలను రుణమాఫీ యాప్​లో అప్​లోడ్ చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. దీంతో రైతు రుణమాఫీ నిర్ధారణ ప్రక్రియలో రాష్ట్రంలో ఆదిలాబాద్​ జిల్లా మొదటి స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. 

వేగంగా ప్రక్రియ చేపడుతున్నాం

జిల్లాలో రుణమాఫీ కాని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ వేగంగా చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 90 శాతం దరఖాస్తులకు సంబంధించిన రైతుల కుటుంబాల వివరాలను రైతు రుణమాఫీ యాప్ లో అప్ లోడ్ చేశాం. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి పంపిస్తాం.
- శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్​చార్జి అధికారి 

రుణమాఫీ యాప్​లో సెల్ఫీ సెల్ఫీ ఫొటోను అప్​లోడ్​ చేసిన ఈ రైతు పేరు నిమ్మల రవీందర్ రెడ్డి. హైదరాబాద్​లో ఉంటున్న ఈయన రుణమాఫీ కాకపోవడంతో సొంత గ్రామమైన జైనథ్ మండలం మాండగడ గ్రామానికి వచ్చి సెల్ఫీ దిగి రుణమాఫీ అఫిడవిట్​ను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. వివిధ కారణాలతో సదురు రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదు. దీంతో అధికారులు చేపటిన కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కోసం 
హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ రైతు వివరాలను ప్రత్యేక యాప్​లో అప్​లోడ్ చేశారు.