మొరం, మైనింగ్‌ పై సీరియస్‌ యాక్షన్

  •     ఇసుకను కంట్రోల్​ చేసిన స్ఫూర్తితో ముందుకు 
  •     మొరం దందా చేస్తున్న 130 మంది లిస్టు రెడీ
  •     యాక్షన్​ విషయంలో సీపీకి పూర్తి స్వేచ్ఛ
  •     మేయర్​ నీతూ కిరణ్​ భర్త దండు శేఖర్​ బైండోవర్​తో అక్రమార్కులకు వార్నింగ్​ 
  •     దందా చేస్తున్న వారిలో గులాబీ నేతలే అధికం
  •     మానుకోవాలని నెలన్నర కిందటే ఇన్​ఛార్జి మంత్రి జూపల్లి అల్టిమేటం ​ 

నిజామాబాద్​,  వెలుగు:  గత  బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ అండతో చెలరేగిపోయిన మొరం,  మైనింగ్​ మాఫియాపై కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఫోకస్​ పెట్టింది. నిజామాబాద్ జిల్లాలో మొరం బిజినెస్​తో గుట్టలను కరగదీస్తున్న వారి లెక్కలు రెడీ అయ్యాయి. వాల్టా చట్టాన్ని ఖాతరు చేయక ప్రకృతి వినాశనానికి  కారణమవుతున్న వారిపై కఠినంగా వ్యవహరించేలా ఆఫీసర్లకు ప్రభుత్వం ఫ్రీహ్యాండ్​ ఇచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా మొరం దందా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన  ఆర్డర్స్ ఇంప్లిమెంట్ ​కాబోతున్నాయి.  ఇసుక మాఫియాను కట్టడి చేసినట్లుగానే మొరం మాఫియాపై అధికారులు ఫోకస్​ పెట్టారు. ఈ క్రమంలో  నిజామాబాద్​ మున్సిపల్ మేయర్​ నీతూకిరణ్​ భర్త దండు చంద్రశేఖర్​ను బైండోవర్​ చేసి అందరికీ వార్నింగ్​ మెసేజ్​ పంపారు.

నిరంతర సమాచార సేకరణ

జిల్లాలో మొత్తం 130 మంది మొరం దందాలో ఉన్నట్లు సీపీ కల్మేశ్వర్​ స్టేషన్ల వారీగా లెక్కలు తేల్చారు.  బీఆర్ఎ​స్ ముఖ్య లీడర్లు వారి అండతో దందా చేస్తున్న వారి సమగ్ర వివరాలు, నడుపుతున్న జేసీబీలు, టిప్పర్ల సంఖ్యను పూర్తిగా సేకరించారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు నెలన్నర కింద మొదటిసారి ఇందూరు వచ్చినప్పుడు పౌరుల నుంచి ఈ విషయంలో నేరుగా ఫిర్యాదులు వచ్చాయి.  స్పందించిన మంత్రి తీరు మార్చుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు చూస్తారని ఓపెన్​ వార్నింగ్​ ఇచ్చారు.  దీంతో ఇసుక అక్రమ రవాణా కంట్రోల్​లోకి వచ్చినా మొరం తవ్వకాలు మాత్రం ఆగడం లేదు.  గ్రౌండ్​ రియాల్టీని నిత్యం సేకరిస్తున్న ఆయన పరిస్థితి సెట్​ చేయాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ, సీపీ కల్మేశ్వర్​ను ఆదేశించారు.  

బైండోవర్​ అందుకే..

ఆర్మూర్​, బోధన్​, నిజామాబాద్ అర్బన్​, రూరల్,​ బాల్కొండలో బీఆర్ఎస్​ ముఖ్య లీడర్లు మొరం తవ్వకాల్లో ఇన్వాల్ అయి ఉన్నారు.  బినామీలకు నిర్వహణ అప్పగించి తమను ఎవరూ గమనించడం లేదని ఇన్నాళ్లు భ్రమపడ్డారు. ఆఫీసర్లను బెదిరించి అడుగు ముందుకు వేయనీయలేదు. కాంగ్రెస్​ గవర్నమెంట్​ వచ్చాక కేసులు నమోదు చేస్తే బద్నాం పాలిటిక్స్​ చేస్తారనే అంచనాతో జాగ్రత్త  వహించారు.  దందా బంద్​ చేయించే ప్రయత్నంలో   మేయర్​ భర్త దండు చంద్రశేఖర్ ను బైండోవర్ చేశారు.   రాత్రి పగలు మొరం బిజినెస్‌లో మునిగి ఉండే ఆయన్ని  బైండోవర్​ చేస్తే మిగితా అందరిని కట్టడి చేయొచ్చనే ఎత్తుగడ అమలు చేశారు.  తీరు మారని పక్షంలో జేసీబీ, టిప్పర్లు స్వాధీనం చేసుకోవాలని, కేసులు పెట్టాలని సీపీ కల్మేశ్వర్​ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది