భవిష్యత్తులో రాహుల్ దేశాన్ని నడపగలరు: సచిన్ పైలట్

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ లీడర్  రాహుల్  గాంధీ భవిష్యత్తులో దేశాన్ని నడపగలరని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి సచిన్  పైలట్  అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ప్రజలు, ప్రతిపక్షాలన్నీ రాహుల్  వెంట ఉంటాయని ఆయన అన్నారు. ఆదివారం పీటీఐకి పైలట్  ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్  జోడో యాత్రతో రాహుల్.. కేంద్రంలోని బీజేపీ భరతం పట్టారని పేర్కొన్నారు. ‘‘లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్  అపొజిషన్  పార్టీలను ముందుండి నడిపిస్తున్నారు. ఆ పదవి ఎంతో బాధ్యతతో కూడినది. ఆయన కాంగ్రెస్ కు మాత్రమే కాదు. 

మొత్తం ప్రతిపక్షాలకే లీడర్. ఆయన అడిగే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు. అందుకే, కేంద్రం ప్రతిసారీ యూటర్న్ లు తీసుకుంటున్నది. ప్రజా సమస్యలపై రాహుల్  ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. రాహుల్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక అధికార పార్టీ నేతలు నీళ్లు నములుతున్నారు. ప్రభుత్వం ఒక అజెండా తర్వాత మరో అజెండాను ముందుకు తెస్తున్నది. కానీ, ఏ అజెండాను కూడా అమలు చేయలేకపోతున్నది. అన్ని విషయాల్లోనూ కేంద్రం ఫెయిల్  అయింది. లేటరల్  ఎంట్రీ, వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది” అని పైలట్ అన్నారు.