న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 13న వయనాడ్ లోక్ సభకు బైపోల్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రాయ్ బరేలీ, వయనాడ్ నుంచి పోటీచేశారు. రెండు చోట్లా ఆయన గెలుపొందారు.
అయితే, వయనాడ్ సీటును వదులుకోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ సీటుకు బైపోల్ నిర్వహిస్తామని ఈసీ ఇటీవలే ప్రకటించింది. వయనాడ్ లోక్ సభ బైపోల్ తో పాటు 14 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ సీట్లకు కూడా నవంబరు 13న ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. ఇక, ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ అసెంబ్లీ సీటు, నాందేడ్ లోక్ సభ సీటుకు నవంబరు 20న ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఫలితాలను అదే నెల 23న ప్రకటిస్తారు.