పాలమూరు డీసీసీబీపై కాంగ్రెస్​ ఫోకస్​

  • నేడు చైర్మన్​ పదవికి ఎన్నిక
  • యునానిమస్​ చేసేందుకు ప్రయత్నాలు
  • రెండు రోజుల కింద డైరెక్టర్లతో హైదరాబాద్​లో మంతనాలు
  • తెరపైకి మామిళ్లపల్లి విష్ణువర్ధన్​రెడ్డి పేరు

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్​నగర్​ డీసీసీబీ చైర్మన్​ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం అధ్యక్ష​ పదవికి ఎన్నిక జరుగనుండగా, ఏకగ్రీవం చేయాలని పావులు కదుపుతోంది. అత్యధిక మంది డైరెక్టర్లు బీఆర్ఎస్​ పార్టీకి చెందిన వారే ఉన్నా.. తాము నిర్ణయించిన క్యాండిడేట్​కు మద్దతు తెలిపేలా మంతనాలు జరుపుతోంది. అయితే బీఆర్ఎస్​ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సిట్టింగ్​ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.

చైర్మన్​ రాజీనామాతో..

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) మహబూబ్​నగర్​ పరిధిలో పాలమూరుతో పాటు నారాయణపేట, నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 77 ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్​) ఉండగా 15 డైరెక్టర్​ పోస్టులు ఉన్నాయి. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్​గా మక్తల్​కు చెందిన నిజాంపాషాను ఎన్నుకున్నారు. అయితే, గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల చైర్మన్​ పదవికి కూడా రాజీనామా చేశాడు.

దీంతో చైర్మన్​ ఎన్నికను ఈ నెల 23న నిర్వహించేందుకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. దీని ప్రకారం శుక్రవారం ఎన్నిక జరగనుంది. 15 మంది డైరెక్టర్లు ఓటింగ్​లో పాల్గొనున్నారు. స్థానిక డీసీసీబీ ఆఫీసులోనే ఎన్నిక నిర్వహించనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చైర్మన్​ స్థానానికి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. 11 గంటల నుంచి 11.30  గంటల వరకు నామినేషన్ల పరిశీలన

12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 2:30కు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్​ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. 

హైదరాబాద్​లో మంతనాలు..

డీసీసీబీ చైర్మన్​ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్​ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. 15 మంది డైరెక్టర్లలో బీఆర్ఎస్​కు 12 మంది సంఖ్యా బలం ఉండగా, కాంగ్రెస్ కు రెండు, బీజేపీకి ఒకరు ఉన్నారు. 8 మంది మద్దతు ఎవరికి ఉంటే వారే చైర్మన్​గా గెలుపొందుతారు. అయితే అధికార పార్టీ ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాన్​గల్​ డైరెక్టర్​ మామిళ్లపల్లి విష్ణువర్ధన్​ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. ఈయన గతంలో కాంగ్రెస్​ పార్టీలో ఉండగా, ఆ తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. 

అదే పార్టీ నుంచి డైరెక్టర్​గా గెలుపొందారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి మామిళ్లపల్లి కాంగ్రెస్​ పార్టీ కోసం పని చేస్తున్నారు. గత పార్లమెంట్​ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ తరపున నాగర్​కర్నూల్​ ఎంపీగా పోటీ చేసిన మల్లు రవికి మద్దతు పలికారు. ఆ తర్వాత పార్టీ నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి మారకున్నా.. హస్తం పార్టీకి పని చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ ఈ ఎన్నికల్లో మామిళ్లపల్లికి సపోర్ట్​ చేసేందుకు సిద్ధమైంది. ఆయనను చైర్మన్​ చేసి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

 ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఓ లీడర్​ బంధువు ఫంక్షన్​కు మహబూబ్​నగర్, మేకగూడ, ఆమనగల్లు, గోరిట, కోస్గి, నారాయణపేట, కొత్తకోట, షాద్​నగర్, పుటాన్​దొడ్డి, ఉప్పునుంతల, వెంకటాయపల్లి, కోడూరు, ఆయోధ్యనగర్​ డైరెక్టర్లను పిలిపించారు. అక్కడే మామిళ్లపల్లి వారితో మంతనాలు జరిపి, తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ మేరకు ఒక్కో డైరెక్టర్​కు పెద్ద మొత్తంలో నజరానాలు కూడా ప్రకటించినట్లు సమాచారం. 

బరిలో ఇద్దరు ఉండే అవకాశం..

డీసీసీబీ చైర్మన్​ పోస్టు ఉమ్మడి జిల్లా స్థాయి పదవి కావడం.. ప్రొటోకాల్​ కూడా ఉండడంతో ఈ స్థానంపై పోటీ చేసేందుకు మరికొందరు సిద్ధం అవుతున్నారు. మహబూబ్​నగర్​ డైరెక్టర్​ కోరమోని వెంకటయ్య బరిలో ఉంటారనే టాక్​ నడిచినా..  ఇటీవల ఆయన చైర్మన్​ పదవి చేయి దాటిపోయిందని తన సన్నిహిత వర్గాలతో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే అనూహ్యంగా షాద్​నగర్​ నియోజకవర్గంలోని మేకగూడ బీఆర్ఎస్​ డైరెక్టర్​ 

కె.మంజులా రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఆమె చైర్మన్​ పోటీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అత్యధిక డైరెక్టర్లు బీఆర్ఎస్ కే ఉండడంతో తమకే మద్దతు ఉంటుందనే నమ్మకంతో పోటీకి సై అంటున్నట్లు తెలిసింది. దీంతో పోటీ మామిళ్లపల్లి, మంజులారెడ్డి మధ్య ఉండే అవకాశం ఉంది.