ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్కూళ్ల నిర్వహణకు నిధులొచ్చినయ్

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.6.74 కోట్లు విడుదల
  • ఎస్ఎంసీ ఖాతాలో 50 శాతం జమ
  • ఇప్పటికే ఉచిత కరెంట్​తో ఊరట

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుం టోంది. ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు పాఠశాలల నిర్వహణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల నిర్వహణకు రూ.6.74 కోట్ల నిధులు విడుదల చేసింది. ఎస్ఎంసీ ఖాతాల్లో 50 శాతం నిధులు జమ అయ్యాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి మంజూరు చేశారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఏడాదికి రూ.10 వేలు, 31 నుంచి 100 వరకు రూ. 25 వేలు, 101 నుంచి 250 వరకు ఉంటే రూ. 50 వేలు, వెయ్యి మంది ఉంటే రూ. 75 వేలు, వెయ్యికి పైగా ఉంటే రూ. లక్ష నిధులు కేటాయించింది. 

తీరనున్న నిర్వహణ సమస్య

స్కూళ్ల నిర్వహణ కోసం గతంలో నిధులు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తేవి. ఈసారి త్వరగా మొదటి దశ విడుదల చేయడంతో బడుల నిర్వహణ ఖర్చుల సమస్యలు తీరనున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ఈ ఏడాది రూ.6.74 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆదిలాబాద్ ​జిల్లాలోని 1168 స్కూళ్లకు రూ.1.35 కోట్లు, మంచిర్యాలలోని 760 స్కూళ్లకు రూ.2.39 కోట్లు, నిర్మల్​లోని 762 పాఠశాలలకు రూ.1.35 కోట్లు, ఆసిఫాబాద్​జిల్లాలోని 917 పాఠశాలలకు రూ.1.62 కోట్లు రిలీజ్​ అయ్యాయి. ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీలతో స్కూళ్లను అభివృద్ధి చేస్తుండగా, తాజాగా విడుదలైన నిధులతో ఆయా పాఠశాలల నిర్వహణ ఖర్చుల భారం తీరనుంది.

స్కూళ్లలో కంప్యూటర్లు, చాక్​పీస్​లు, వైట్ పేపర్స్, ప్రొజెక్టర్లు, ఆర్వో బుక్​లు, ల్యాబ్ మెటీరియల్, డ్రింకింగ్ వాటర్, స్టేషనరీ, రిజిస్టర్ల కొనుగోలు, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపు, స్పోర్ట్స్ సామగ్రి కొనుగోలు, స్పోర్ట్స్​నిర్వహణ, మైనర్ రిపేర్ల సంబంధించి ఈ నిధులు వినియోగించుకోనున్నారు. స్కూల్ మేనేజ్​మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఖర్చులపై సోషల్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నిధులు మంజూరు, ఖర్చులు, ఇతర వివరాలు నోటీస్ బోర్డులపై ఉంచనున్నారు. 

ఉచిత కరెంట్​తో..

ప్రభుత్వం మొదటి సారిగా పాఠశాలలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయనుండటంతో స్కూళ్ల నిర్వహణ భారం తగ్గింది. ఇప్పటికే నివాస గృహాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. స్కూళ్లకు కూడా ఫ్రీగా కరెంట్ ఇస్తుండడంతో ఊరట లభించింది. ప్రతి నెలా స్కూళ్ల స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ. 5 వేల వరకు కరెంట్ బిల్లులు వచ్చేవి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది నుంచి కరెంట్ బిల్లులు కట్టాల్సిన పనిలేకుండాపోయింది.

ప్రతి ఏడాది నిర్వహణ కింద విడుదల చేసే స్కూల్ గ్రాంట్స్​లో 50 శాతానికి పైగా నిధులు కరెంట్ బిల్లులకే చెల్లించాల్సి వచ్చేది. దీంతో మిగతా ఖర్చులకు నిధులు లేక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వేసవిలో కరెంట్ సదుపాయం లేని పాఠశాలల్లో ఉక్కపోతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం 
లభించనుంది.