ఆసక్తికరంగా ఎమ్మెల్సీ ఫైట్​.. క్యాండిడేట్లను ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్​

  • కీ’ రోల్​ పోషించనున్న బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు
  • కాంగ్రెస్​కు సపోర్ట్​ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ

మహబూబ్​నగర్, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్​కు కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల నుంచి క్యాండిడేట్లు ఫైనల్​ కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్​ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఉండడంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. ఇక బుధవారం పాలమూరులో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం రేవంత్​ రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇవ్వడం, కాంగ్రెస్​  క్యాండిడేట్​కు సపోర్ట్​ చేయాలని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అభ్యర్థుల ప్రకటనతో..

కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ప్రస్తుతం బై ఎలక్షన్​ జరుగుతోంది. కాంగ్రెస్​ పార్టీ నుంచి ఎంఎస్ఎన్​ ఫార్మా కంపెనీ డైరెక్టర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్​రెడ్డి పోటీ చేస్తారని బుధవారం పాలమూరులో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం ప్రకటించారు. 

బీఆర్ఎస్​ పార్టీ నుంచి షాద్​నగర్​ నియోజకవర్గం కొత్తూరు మాజీ జడ్పీటీసీ, ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ జడ్పీ వైస్​ చైర్మన్ నవీన్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ స్టేట్​ చీఫ్​ కేసీఆర్​ గురువారం అనౌన్స్​ చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే బీజేపీకి స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు లేకపోవడంతో ఆ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఆశలు రేకెత్తిస్తున్న సీఎం హామీ..

మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల్లో 14 మంది ఎమ్మెల్యేల ఓట్లను కలుపుకొని 1,455 మంది ఓటర్లున్నారు. ఇందులో కాంగ్రెస్​లో దాదాపు 320 మంది ఓటర్లు, బీజేపీలో 119 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన వారంతా బీఆర్ఎస్​కు చెందిన వారు. వీరంతా మున్సిపాల్టీలు, మండలాలు, జీపీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చు చేశారు. కొందరు అప్పులు చేసి పనులు చేశారు. 

అయితే గత ప్రభుత్వం నాలుగేండ్లుగా వీరు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్​లో పెట్టింది. అప్పులు చేసి పనులు చేసిన లీడర్లు వడ్డీలు కడుతున్నారు. మరికొందరు లీడర్లు బిల్లులు మంజూరు చేయడం లేదని ఆత్మహత్యాయత్నం చేశారు. త్వరలో పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో వీరంతా గత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే బుధవారం పాలమూరులో జరిగిన సభలో సీఎం స్థానిక సంస్థల ఓటర్లకు భరోసా ఇచ్చారు. 

కాంగ్రెస్​ క్యాండిడేట్​ మన్నె జీవన్​రెడ్డికి సపోర్ట్​ చేయాలని కోరారు. ఆయనకు సపోర్ట్​ చేస్తే త్వరలో స్థానిక సంస్థల లీడర్లకు పెండింగ్​లో ఉన్న బిల్లులు మంజూరు చేయించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే మీ తరపున మన్నె జీవన్​రెడ్డి బిల్లుల మంజూరుకు కృషి చేస్తారని చెప్పారు. దీంతో స్థానిక సంస్థల ఓటర్లు ఎవరికి సపోర్ట్​ చేస్తారనేది ఇంట్రస్టింగ్​గా మారింది. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్​ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, జడ్పీటీసీలే ఉండడంతో వీరు ఎవరికి సపర్ట్​ చేస్తే వారినే విజయం వరించనుంది.

మొదటి ఎమ్మెల్సీగా రేవంత్​ రెడ్డి..

ఉమ్మడి  ఏపీలో 2007 ఏప్రిల్​లో మహబూబ్​నగర్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. లాటరీ తీయగా రెండేండ్ల పదవీ కాలం దక్కింది. ఈ ఎన్నికలో రేవంత్​రెడ్డి ఇండిపెండెంట్​గా పోటీ చేసి, కాంగ్రెస్​ అభ్యర్థి జగదీశ్వర్​రెడ్డిపై గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి మళ్లీ జగదీశ్వర్​రెడ్డికి చాన్స్​ దక్కగా, టీడీపీ అభ్యర్థి విజయసారథిరెడ్డి మీద గెలుపొందారు. 2011లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో బ్రేక్​ పడింది. ఆరేండ్ల తర్వాత 2015లో ఎన్నిక జరిగింది. తెలంగాణ ఏర్పడడంతో జనాభా ప్రాతిపదికన ఉమ్మడి పాలమూరు ​ జిల్లాకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. ఆ ఎన్నికలో బీఆర్ఎస్  నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్​ నుంచి కూచకుళ్ల దామోదర్​రెడ్డి గెలుపొందారు. 2021లో ఎన్నికల్లో కసిరెడ్డి, కూచకుళ్లకే బీఆర్ఎస్​ చాన్స్​ ఇచ్చింది.