ఎన్నికల వేళ చేరికలపై ఫోకస్ .. పార్టీలో బలం పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్లాన్

  • కార్యకర్తలు బీఆర్‌‌ఎస్ లోనే ఉన్నారని బీఆర్‌‌ఎస్ ధీమా 

కామారెడ్డి,  వెలుగు: ఎంపీ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలెట్టాయి.  కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇతర పార్టీల నుంచి లీడర్లు, కార్యకర్తల్ని చేర్చుకోవడంపై  ఫోకస్ పెట్టారు.  జహీరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా  కైవసం చేసుకోవాలని వ్యుహ ప్రతివ్యుహాలు రచిస్తున్నారు.  ఇందులో భాగంగా మిగతా పార్టీల క్యాడర్​ను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  తర్వాత  కామారెడ్డి  జిల్లాలో కాంగ్రెస్​ పార్టీలోకి వలసలు పెరిగాయి.  మరో వైపు ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ కూడా చేరికలపై దృష్టి పెట్టింది.  బీఆర్‌‌ఎస్​  లీడర్లు, క్యాడర్​పైనే కాంగ్రెస్​, బీజేపీ పార్టీలు ఫోకస్​ చేస్తున్నాయి.  కొందరు లీడర్లు బీఆర్‌‌ఎస్  పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో తమకు కార్యకర్తల బలం ఉందని బీఆర్​ఎస్​ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఓటు బ్యాంకు పెరుగుతుందని.. 

కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజక వర్గాలు జహీరాబాద్​ పార్లమెంట్​ పరిధిలోకి వస్తాయి.  ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో  కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో  కాంగ్రెస్​కు 2,59,208  ఓట్లు, బీజేపీకి 1,45,774 ఓట్లు, బీఆర్​ఎస్​కు  2,63,666 ఓట్లు వచ్చాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే  ఎక్కువ ఓట్లు సాధించానే టార్గెట్ తో బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు  పై ఎత్తులు వేస్తున్నాయి. 

 కాంగ్రెస్​, బీజేపీలో  చేరే  నాయకుల వల్ల  తమకు  ఓటు బ్యాంకు పెరిగి గెలుపునకు దోహదపడుతుందని ఆయా పార్టీల ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో  ముఖ్య నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి లీడర్లు, కార్యకర్తలు అధికార కాంగ్రెస్ లో  చేరారు.  జహీరాబాద్​ సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్​ బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో ఇటీవల చేరారు. 

బీబీ పాటిల్​ను బీజేపీ అభ్యర్థిగా పార్టీ హైకమాండ్​ ప్రకటించింది.   బీఆర్​ఎస్​ తరపున రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఆయన తనకున్న పరిచయాలతో  జిల్లాలోని ఆయా నియోజక వర్గాలకు చెందిన లీడర్లు, క్యాడర్​ను బీజేపీలోకి వచ్చేలా చేస్తున్నారు.  ఇటీవల మాజీ మంత్రి నేరేళ్ల అంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి,  పలువురు మాజీ ప్రజాప్రతినిధులు,  మండల, గ్రామ స్థాయి లీడర్లు బీజేపీ కండువా కప్పుకున్నారు.   

లీడర్లే వెళుతున్నారు.. 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ను వీడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.  అయితే లీడర్లు మాత్రమే వెళ్తున్నారని, క్యాడర్ మాత్రం తమ వైపే ఉన్నారని ఆ పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.  అవకాశవాదులు పార్టీని వీడారని నిజమైన కార్యకర్తలు గులాబీ పార్టీలోనే ఉన్నారని మండల స్థాయిలో నిర్వహిస్తున్న  మీటింగ్​ల్లో ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతూ క్యాడర్​ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  రెండు సార్లు ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్‌లో   గులాబీ జెండా ఎగిరిందని ఈ సారి కూడా మళ్లీ కచ్చితంగా గెలిచి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.