డిజిటల్ పంట సర్వేపై గందరగోళం

  • సెప్టెంబర్  24 నుంచే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు
  • నేటికీ యాప్  డౌన్ లోడ్  చేసుకోని ఏఈవోలు
  • సీరియస్​గా తీసుకున్న అగ్రికల్చర్​ సెక్రటరీ
  • 2,600 మంది ఏఈవోలు 13 రోజులుగా  ఆబ్సెంట్​
  • సహాయకులను ఇస్తే తప్ప సర్వే చేయలేమని స్పష్టం
  • అవసరమైతే సహాయనిరాకరణ చేస్తామని అల్టిమేటం

హైదరాబాద్, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘డిజిటల్ పంట సర్వే’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంటల సర్వే బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవోల)కు సర్కారు అప్పగించింది. ఈమేరకు శిక్షణ కూడా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే సర్వే ప్రారంభించాల్సి ఉండగా..  పని ఒత్తిడి దృష్ట్యా సహాయకులను ఇవ్వాలని

లేదంటే   సర్వే చేయలేమని ఏఈఓలు చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో పక్షం రోజులుగా డిజిటల్  సర్వే కోసం రూపొందించిన ప్రత్యేక యాప్​ను ఏఈవోలు డౌన్ లోడ్  చేసుకోకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు.  అగ్రికల్చర్  ప్రిన్సిపల్  సెక్రటరీ ‘టీమ్ అప్’ అనే సంస్థ నుంచి కొత్త యాప్​లను తయారు చేయించి తమపై రుద్దడం తప్ప తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఈవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కేంద్రం ఆధ్వర్యంలో డిజిటల్  సర్వే..

 దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పండుతున్న పంటల వివరాలు, ఆయా భూముల రకాలు, నీటి ఆధారం(బోరు, చెరువు, కాల్వ పారకం), యంత్రాల వినియోగం, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, పంటల బీమా ఉందా? లేదా? మార్కెటింగ్  పరిస్థితులు.. లాంటి వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్  పంట సర్వే చేయిస్తోంది. తద్వారా దేశ ఆహారభద్రతపై ఒక అంచనాకు రావడంతో పాటు వ్యవసాయంలో యాంత్రికీకరణ, టెక్నాలజీ, నీటి వసతుల పెంపు, పంటల బీమా వర్తింపు, ఎగుమతులు, దిగుమతులు

మార్కెటింగ్​కు సంబంధించిన కీలక అంశాల్లో మార్పుచేర్పులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలో డిజిటల్  పబ్లిక్  ఇన్ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)ని రూపొందించే లక్ష్యంతో ‘డిజిటల్ అగ్రి మిషన్’ పథకాన్ని తీసుకొచ్చింది. దీని అమలుకు  రూ.2,817 కోట్ల నిధులను ఖర్చు చేస్తోంది.  ఈ డిజిటల్  సర్వేను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది.  ‘డిజిటల్  క్రాప్​ సర్వే’కు  రెండేండ్ల క్రితమే ఆదేశాలు జారీ చేయగా, ఏపీ సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే  ఇప్పటికే కొనసాగుతోంది.  

కానీ అప్పటి బీఆర్ఎస్  సర్కారు దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, కొత్తగా వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో  డిజిటల్  క్రాప్​ సర్వే నిర్వహించాలని  నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏఈవోలకు ట్రైనింగ్  కూడా పూర్తి చేసిన వ్యవసాయశాఖ గత సెప్టెంబరు 24 నుంచి సర్వే నిర్వహించాలని ఆదేశించింది.

సిబ్బంది కొరతే ప్రధాన సమస్య..

రాష్ట్రవ్యాప్తంగా 2,600 మంది అగ్రికల్చర్  ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్లు (ఏఈ ఓలు) పని చేస్తున్నారు. వీరి పరిధిలో దాదాపు 1.50 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది.  సగటున చూసినప్పుడు ప్రతి ఏఈఓ 5,700 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో క్లస్టర్ల విభజన అడ్డదిడ్డంగా జరిగింది. 50 శాతం క్లస్టర్లలో సాగు భూమి 5 వేల ఎకరాలకు మించి ఉంది. ఉదాహరణకు మోత్కూరు మండలంలోని ఒక క్టస్టర్​లో ఒక్క ఏఈఓ పరిధిలో సుమారు 30 వేల ఎకరాల సాగు భూమి ఉంది. దీంతో డిజిటల్​ సర్వే చేసేందుకు అక్కడి ఏఈవోలు వెనుకాడుతున్నారు. 

అదీగాక ఇటీవల యాదాద్రి జిల్లాలోని బీబీనగర్​ మండలంలోని ఓ క్లస్టర్​లో పైలట్​ ప్రాజెక్టు కింద  15 మంది ఏఈవోలను రంగంలోకి దించి డిజిటల్​ సర్వే చేయించారు.  కేవలం 5 వేల ఎకరాలున్న ఒక్క చిన్న క్లస్టర్​లో డిజిటల్  సర్వే చేసేందుకు  మూడు నెలలు పట్టింది. దీంతో  తమకు విలేజ్  లెవల్​లో సహాయకులను ఇస్తే తప్ప  డిజిటల్ ​సర్వే చేయలేమని ఏఈఓలు తేల్చి చెబుతున్నారు. 

13 రోజులుగా ఏఈవోలకు గైర్హాజరు..

డిజిటల్  క్రాప్  సర్వే(డీసీఎస్) యాప్  డౌన్​లోడ్​ చేసుకొని సెప్టెంబర్​24 నుంచి సర్వే ప్రారంభించాలని అగ్రికల్చర్​ సెక్రటరీ ఏఈవోలను ఆదేశించారు. కానీ, సహాయకులు లేకుండా సర్వే సాధ్యం కాదంటూ ఏఈవోలు యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోలేదు. యాప్​ డౌన్​లోడ్​ చేసుకుంటేనే అటెండెన్స్  నమోదవుతోంది.  దీంతో ఈ నెల 27 నుంచి 13 రోజులుగా అందరికీ  ఆబ్సెంట్  వేస్తున్నారని ఏఈవోలు చెబుతున్నారు. తాము డ్యూటీ చేసినా క్యాజువల్​ లీవ్​ తీసుకున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సర్వే విషయంలో మరింత ఒత్తిడి తెస్తే పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తామని  ఏఈవోలు హెచ్చరిస్తున్నారు.   

డిజిటల్  క్రాప్  సర్వే ఇలా..

ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబర్​కు (బై నంబర్​తో సహా) వెళ్లి ఫొటో తీసి క్రాప్  వివరాలు సేకరించాలి. ఎంత ఎరియాలో ఏ క్రాప్  ఉందో ఫోటో దించాలి. సర్వే నంబర్ లోని  ఒక డిజిటల్  పాయింట్  నుంచి 25 మీటర్ల వరకు మాత్రమే డిజిటల్  సర్వే యాప్  తీసుకుంటుంది. అంతకు మించితే మళ్లీ ఆ పాయింట్​ దాకా వెళ్లాలి.  క్రాప్  వెరైటీ, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎప్పుడు వేశారు వంటి వివరాలతో పాటు వాటర్  ఫెసిలిటీ లాంటి వివరాలు అప్​లోడ్​ చేయాలి. ఒక చిన్న  క్టస్టర్ కు 5 వేల నుంచి 10 వేల సర్వే నంబర్లు  వస్తాయి. వీటి ఫొటోలు తీసి, ఆప్​లో అప్​లోడ్​  చేయాలంటే  సర్వే పూర్తికావడానికి ఒక్కో క్లస్టర్​కు ఏడాది పడుతుందని ఏఈవోలు అంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడా చేయాలి.. 

కేంద్ర ప్రభుత్వం  దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో డిజిటల్  పంట సర్వే చేయిస్తోంది. మన రాష్ట్రంలో దాదాపు 15 వేల మందితో  చేయించాల్సిన సర్వేను  కేవలం 2,600 మంది ఏఈవోలతోనే చేయించాలని  చూస్తున్నారు. కానీ ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర11 రాష్ట్రాల్లో డిజిటల్  పంట సర్వేలు చేపడుతున్న ట్లే  తెలంగాణలో కూడా విలేజ్  లెవెల్  అసిస్టెంట్లను నియమించి వాళ్లతో ఈ పంటల సర్వేను చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

- బి.రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీ, టీఎస్ఏఈవోల సంఘం