ప్రమాదాల హైవేలు..! వరంగల్ కమిషనరేట్ లో తరచూ యాక్సిడెంట్స్

  •  
  • నిర్మాణ లోపాలు, సరైన రక్షణ చర్యలు లేకే ప్రమాదాలు
  • బ్లాక్ స్పాట్ల పై దృష్టి పెట్టని ఆఫీసర్లు
  • ఎస్సార్​ఎస్పీ బ్రిడ్జిల వద్ద నో సేఫ్టీ
  • ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్​పరిధిలోని నేషనల్​హైవేలపై డేంజర్​బెల్స్ మోగుతున్నాయి. వెహికల్స్​ఓవర్​ స్పీడ్, స్వయం తప్పిదాలతోపాటు రోడ్లపై ఉన్న ఇంజినీరింగ్ మిస్టేక్స్, నిర్వహణలోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా కమిషనరేట్ లోని రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతుండగా, వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్​స్పాట్లుగా గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిత్యం యాక్సిడెంట్స్..​

కమిషనరేట్ పరిధిలో దాదాపు 286 కిలోమీటర్ల మేర నేషనల్​హైవేలు విస్తరించి ఉన్నాయి. ఈ రోడ్లపై అన్నీకలిపి రోజుకు సగటున 5 లక్షలకుపైగా వెహికల్స్ రాకపోకలు సాగిస్తుండగా, ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. హైవేలపై చాలాచోట్లా నిర్మాణ, నిర్వహణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్​హెచ్​-563పై ఎల్కతుర్తి శివారు నుంచి హసన్​పర్తి వరకు తొమ్మిదికిపైగా బ్లైండ్​కర్వ్స్ ఉండగా, వరంగల్​-ఖమ్మం మార్గంలో కూడా 15 వరకు ప్రమాదకర మూలమలుపులను గతంలోనే గుర్తించారు. 

ఎన్​హెచ్​-163పై జనగామ నుంచి కమిషనరేట్​లోని ఆత్మకూరు వరకు, ఎన్​హెచ్​-365పై ఖానాపూర్​నుంచి మల్లంపల్లి, సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే 765డీజీపై కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాగా నేషనల్​హైవేలతోపాటు ఇతర అన్ని రోడ్లు కలిపి ఏటా సగటున 1,500కు పైగా యాక్సిడెంట్లు జరుగుతుండగా, దాదాపు 450 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మరో 1300 మందికిపైగా గాయాలపాలవుతుండటం గమనార్హం. 

డేంజర్​ జోన్​ లో బ్రిడ్జిలు..

నేషనల్​హైవేలపై అనంతసాగర్, చింతగట్టు వద్ద ఉన్న ఎస్సార్​ఎస్పీ కెనాల్​బ్రిడ్జిల పరిస్థితి దారుణంగా మారింది. సరైన నిర్వహణ లేక రెయిలింగ్​పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. బ్రిడ్జి ఇరుకుగా మారడంతో రెండు రోజుల కిందట అనంతసాగర్​ వద్ద ఓ ఇసుక లారీ కెనాల్​లోకి దూసుకెళ్లి, డ్రైవర్​తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఎన్​హెచ్​-563పై ఎల్కతుర్తి ఓల్డ్​ టోల్​ గేట్​వద్ద రోడ్డు మధ్యలో వదిలేసిన సిమెంట్ దిమ్మె వల్ల ప్రమాదాలు జరిగి, వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. రోడ్డు మధ్యలో ఎలాంటి సైన్ బోర్డ్స్, రేడియం స్టిక్కర్స్​లేకపోవడం, హెవీ వెహికల్స్​రోడ్డుకు ఇరువైపులా నిలుపుతుండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

రక్షణ చర్యలు కరవు..

తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను ఎన్​హెచ్, పోలీస్ శాఖల అధికారులు విజిట్​చేసి, లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రమాదాల నివారణ కోసం రోడ్డు సేఫ్టీ మీటింగ్​ను కూడా ఆఫీసర్లు లైట్​తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. 

ALSO READ : షెల్టర్ హోమ్ లీజుకు.. నిరాశ్రయులు రోడ్లపైన.!

గతంలో ప్రమాదాల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు, ఇంజినీరింగ్​డిపార్ట్​మెంట్​ అధికారులు జాయింట్​ఇన్​స్పెక్షన్​నిర్వహించి కమిషనరేట్​వ్యాప్తంగా 131 బ్లాక్​స్పాట్లను గుర్తించారు. కానీ రక్షణ చర్యలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ ​చేస్తున్నారు.