గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు డెడ్ బాడీతో ఆందోళన

ఆర్మూర్, వెలుగు: గల్ఫ్ ఏజెంట్​ఇంటి ముందు డెడ్ బాడీని ఉంచి ఆందోళన చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపల్​పరిధి మామిడిపల్లికి చెందిన వన్నెల్​దేవి రాజేశ్(60) కొడుకు సృజన్​కు యూరప్​లో జాబ్ చూపిస్తానని స్థానిక గల్ఫ్ ఏజెంట్​ప్రసాద్ చెప్పగా, ఏడాది కింద రూ.5 లక్షలు ఇచ్చాడు. జాబ్ కోసం సృజన్​ను నెల కింద యూరప్​పంపకుండా కజకిస్తాన్ పంపాడు. అక్కడ జాబ్ లేకపోవడంతో  15 రోజుల కింద  అతడు ఇంటికి తిరిగొచ్చాడు.

 జాబ్ కోసం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కొద్దిరోజులుగా ఏజెంట్ ప్రసాద్ ను రాజేశ్ అడుగుతున్నాడు. బుధవారం మరోసారి ఏజెంట్ ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులను డబ్బులు ఇవ్వమని అడగగా లేవని చెప్పేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్ ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం అతనికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు హాస్పిటల్​తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

గల్ఫ్ ఏజెంట్ మోసం చేయడంతోనే రాజేశ్ గుండెపోటుతో చనిపోయాడని, న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటి  ముందు డెడ్ బాడీని ఉంచి నిరసన తెలిపారు. ఆర్మూర్​పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి ఏజెంట్​తో ఫోన్​లో మాట్లాడారు. పోలీసు స్టేషన్ కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు పోలీసులు సూచించారు. అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులు సొంతూరు తొర్లికొండకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. రాజేశ్​గతంలో ఓ టీవీ చానల్ లో రిపోర్టర్ గా పనిచేశాడు.