అవకతవకలపై ఎంక్వైరీ చేయాలి

కరీంనగర్‌‌ టౌన్‌‌, వెలుగు : శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను వీసీ మల్లేశ్ మోసం చేశాడని, ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేయాలంటూ అవుట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులు సోమవారం యూనివర్సిటీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2009 నుంచి వివిధ డిపార్ట్‌‌మెంట్లలో 37 మంది పనిచేస్తున్నామని, 2013లో ఆ సంఖ్య 59 పెరిగిందన్నారు.

2021లో విధుల్లో చేరిన వీసీ మల్లేశ్‌‌ తమను అవుట్‌‌ సోర్సింగ్‌‌ ఏజెన్సీకి అప్పగించారని చెప్పారు. అనంతరం విద్యార్హత, సీనియారిటీని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా కొందరికి ప్రమోషన్‌‌ ఇచ్చి డేటా  ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించారని ఆరోపించారు.

దీంతో అర్హత కలిగిన తమకు అన్యాయం జరిందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. ఆందోలనలో ఉద్యోగులు కుమార్‌‌, సతీశ్‌‌, రమేశ్ పాల్గొన్నారు.