ఇంటింటి సర్వే షురూ..

  • వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు
  • ఇద్దరున్న ఇంటికే అరగంట సమయం
  • ఆపై మెంబర్స్ ఉంటే మరింత టైం
  • ఇంకా పూర్తి కాని స్టిక్కర్ల ప్రక్రియ

యాదాద్రి, నల్గొండ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. ఇంటింటికీ ఎన్యుమరేటర్లు వెళ్లి ప్రజల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సమగ్ర సర్వే కోసం రూపొందించిన ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో వివరాలు నమోదు చేయడానికి ఎన్యుమరేటర్లకు ఎక్కువ సమయం పడుతోంది. ఇద్దరే ఉన్న కుటుంబం వద్ద అరగంట టైం పడుతుంటే, ఎక్కువ మంది మెంబర్లు ఉన్న కుటుంబం వద్ద అంతకు మించి టైం పడుతోంది. ఇందులో కులం పేరు నమోదు విషయంలోనే ఎక్కువ టైం పడుతోంది.

 ఏ,బీ,సీ,డీ గ్రూప్​లు వెతుక్కొని, అందులో కులం, ఉప కులం వెతకడానికి మరింత టైం పడుతోంది. పేరు, ఆధార్, రేషన్​కార్డు నంబర్లు వెంటనే చెబుతున్నారు. అగ్రికల్చర్​ ల్యాండ్స్​ ఉన్నవాళ్లు ధరణి పాస్​ బుక్స్ చూపిస్తున్నారు. క్రాప్ లోన్లు, మహిళా సంఘాల ద్వారా తీసుకున్న లోన్స్ వెల్లడిస్తున్నారు. అయితే బ్యాంక్​ అకౌంట్లు, ఆస్తుల వివరాలు చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. వివరాలు వెల్లడిస్తే తమకు వచ్చే స్కీమ్స్ రాకుండా పోతాయేమోన్న అనుమానంతో చెప్పడానికి ఆలోచిస్తున్నారు.  

పూర్తికాని స్టిక్కర్ల ప్రక్రియ..

అయితే కుటుంబాలను గుర్తించడం కోసం రూపొందించిన స్టిక్కర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా అంటించారు. ఇంకా అనేక ఇండ్లకు స్టిక్కర్లు అంటించాల్సి ఉంది. కొన్ని ఇండ్లకు తాళాలు వేసి ఉండడం ఒక కారణమైతే.. కొంతమంది ఎన్యుమరేటర్లు నిర్లక్ష్యం కారణంగా స్టిక్కర్లు అంటించలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 

స్లోగా సాగుతున్న సర్వే..

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వే స్లోగా సాగుతోంది. కొన్ని ఇండ్లలో మూడు నుంచి నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి. అయితే ఆ ఇండ్లలో సర్వే చేయడానికి వెళ్లిన ఎన్యుమరేటర్స్​ ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలే తీసుకుంటున్నారు. ఆ వివరాలను మిగిలిన కుటుంబాలకు నమోదు చేస్తున్నారు. మూడు నాలుగు కుటుంబాలకు కలిపి ఒక్కటే స్టిక్కర్​వేస్తున్నారు. 

యాదాద్రిలో 14,013 ఇండ్లు సర్వే..

యాదాద్రి జిల్లాలో స్టిక్కర్లు వేసేందుకు 2,58,667 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 45,132 కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,13,535 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు. 1949 ఎన్యుమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేశారు. శనివారం ప్రారంభమైన సర్వేలో 1782 ఎన్నిమరేటర్లు పాల్గొని 14,013 కుటుంబాల వివరాలను నమోదు చేశారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2,373 కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో 11,640 కుటుంబాల వివరాలు నమోదు చేశారు. 

కచ్చితమైన సమాచారం నమోదు చేయాలి

సమగ్ర ఇంటింటి కుంటుంబ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి. ఇంటింటికీ వెళ్లే ఎన్యుమరేటర్లు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు కచ్చితమైన సమాచారం నమోదు చేయాలి. ఈ సమాచారం ఆధారంగానే భవిష్యత్​లో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.- ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి