ఆదిలాబాద్ జిల్లాలో సమగ్ర సర్వే షురూ

  • సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్లు
  • స్టిక్కర్లు పకడ్బందీగా అంటించాలని ఆదేశం
  • సర్వేలో నిర్లక్ష్యం వహించిన ఇచ్చోడ ఎంపీడీవో, ఏవోలకు నోటీసులు

నెట్​వర్క్, వెలుగు: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన అంశాలపై  చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం మొదలైంది. గ్రామాల్లో ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగి వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వేలో భాగంగా ప్రజలు అందుబాటులో ఉండి అన్ని వివరాలతో  సిద్ధంగా ఉండాలని ఆదిలాబాద్​ కలెక్టర్​రాజర్షి షా కోరారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో నిర్వహించిన సర్వేను ఆయన​పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 1.97 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 2012 ఎన్యూమరేషన్ బ్లాక్​లు ఉన్నాయని,  213 మంది ఎన్యుమరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీవైఎస్​ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

సర్వేలో నిర్లక్ష్యం చేసిన  ఇచ్చోడ ఎంపీడీవో, ఏవోలకు షోకాజ్ నోటీసులు

ఇంటింటి సర్వే జాబితాలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సీరియస్ అయ్యారు. ఇంటింటి జాబితా సర్వేలో భాగంగా ఇచ్చడో మండలంలోని ముఖ్రా కే, గెర్జం గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో స్టిక్కర్ల ప్రక్రియను పరిశీలించారు. గెర్జంలో ఇండ్ల జాబితా సర్వే సరిగా నిర్వహించకపోవడంతో అధికారులపై మండిప డ్డారు. ఎంపీడీవో లక్ష్మణ్, ఏవో కైలాస్, పంచాయతీ సెక్రటరీ సయ్యద్ ఏజాజ్ హస్మీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొద్ది రోజులుగా ఇండ్ల జాబితా, సర్వేపై శిక్షణ, సమావేశాలు, గూగుల్ మీట్, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన, దిశానిర్దేశం చేసినప్పటికీ విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 

 సర్వేకు అందరూ సహకరించాలి

ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకారం అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. సర్వే కోసం ఇండ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు. మామడ మండలం న్యూ సాంగ్విలో సర్వే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి అతికించిన స్టిక్కర్లను పరిశీలించారు. తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో భాగంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, 9వ తేదీ నుంచి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందని వివరించారు.

ఆసిఫాబాద్ ​జిల్లా కాగజ్ నగర్, సిర్పూర్ టీ మండలాల్లో జరుగుతున్న సర్వేను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా పరిశీలించారు. ప్రజలు నుంచి అన్ని వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 1,543 ఎన్యూమరేషన్ బ్లాక్​లను గుర్తించారు. పర్యవేక్షణకు 168 మంది అధికారులను సూపర్​వైజర్లుగా నియమించారు.

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్​ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. కుంటాల మండలంలోని మేధన్ పూర్ లో కొనసాగుతున్న సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బోథ్​మండలంలోని కుచులాపూర్, ధన్నూర్, కన్గుట్ట గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ఎంపీడీశో రమేశ్, ఎంపీవో జీవన్​రెడ్డి పాల్గొని కార్యదర్శులకు సూచనలు చేశారు. ఇండ్లకు స్టిక్కర్లు అతికించారు. 

ఇథనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని రద్దు చేసేవరకు సర్వే జరగనివ్వం

దిలావర్​పూర్ మండల కేంద్రంలోని ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కుటుంబ సర్వేను జరగనివ్వమని నిర్మల్​జిల్లా దిలావర్​పూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీతో తమకు అన్యాయం జరగుతుందని, ఆ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఏడాది కాలంగా పోరాటాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు  ఇచ్చిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా అనుమ తులు ఇచ్చి నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసేవరకు సర్వేను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తీర్మానించుకొని స్థానిక ఎంపీవో గోవర్ధన్ కు వినతిపత్రం  ఇచ్చారు.