చెత్త కష్టాలకు చెక్​ .. మనుబోతుల చెరువు వద్ద పూర్త​యిన డంపింగ్​ యార్డు

  • రూ.18లక్షలతో విద్యుత్​లైన్​ ఏర్పాట్లు
  • నవంబర్​ మొదటి వారంలో యార్డు ఓపెన్​కు సన్నాహాలు

భద్రాచలం, వెలుగు:  భద్రాచలంలో చెత్త కష్టాలు తీరనున్నాయి.  రూ.80 లక్షల వ్యయంతో టౌన్​ శివారున మనుబోతుల చెరువు వద్ద 8.5 ఎకరాల్లో డంపింగ్​ యార్డును నిర్మించారు. 1.5 ఎకరాల్లో పొడి,తడి చెత్తను వేరు చేసే యార్డును నిర్మించగా, మిగిలిన 7 ఎకరాల్లో మొక్కలను నాటి వనాన్ని పెంచనున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత భద్రాచలం టౌన్​కు డంపింగ్​ యార్డు లేకుండా పోయింది.

 గోదావరి కరకట్టపై, గోదావరి నదిలో చెత్తను డంప్​ చేస్తున్నారు. గోదావరి నది కలుషితం అవుతుందని, కట్టపై వ్యర్థాలు తగలబెట్టడం ద్వారా పొగ రామాలయం పరిసరాలలోని కాలనీ వాసులకు ఇబ్బందులను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనుబోతుల చెరువు వద్ద డంపింగ్​యార్డు నిర్మాణం చేపట్టారు. 

విద్యుత్​ లైన్​ పూర్తి..

డంపింగ్​ యార్డులో పొడి,తడి చెత్తను వేరు చేసే యంత్రాలు పనిచేసేందుకు అవసరమైన విద్యుత్​ లైన్​ ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. ట్రాన్స్ కో ఆధ్వర్యంలో రూ.18 లక్షల గ్రామపంచాయతీ నిధులతో వీటిని చేపట్టారు. భారీ పోల్స్ ఏర్పాటు చేసి, 11 కేవీ విద్యుత్​ లైన్​ నిర్మాణం చేపట్టారు. భారీ ట్రాన్స్ ఫార్మర్లను పెడుతున్నారు. 

మిషన్ల కొనుగోలు..

డంపింగ్​ యార్డులో తడి,పొడి చెత్తను వేరు చేసే యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీసీ రూ.70లక్షలతో పొడి చెత్తను వేరు చేసి క్రష్​ చేసే మిషన్లను అందిస్తోంది. రూ.50లక్షల వ్యయంతో భద్రాచలం గ్రామ పంచాయతీ మరో మిషన్​ను ఇస్తోంది. ఇప్పటికే ఇవి భద్రాచలం చేరుకున్నాయి. వీటిని ఇన్​స్టాల్​ చేసేందుకు కోయంబత్తూరు నుంచి టెక్నీషియన్లు రానున్నారు. 

రోజుకు 15 టన్నుల చెత్త

భద్రాచలం గ్రామపంచాయతీలో 16 వేల ఇండ్ల వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజుకు 27 వాహనాల ద్వారా 15 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్​యార్డు పూర్తయ్యాక మరో 5 వాహనాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను యంత్రాల ద్వారా క్రషింగ్​ చేసి ఎరువులుగా ఉపయోగించనున్నారు. ఇలా చేయడం ద్వారా నెలకు రూ.5లక్షల ఆదాయాన్ని పంచాయతీ సాధించనుంది. 

నవంబర్ మొదటి వారంలో ప్రారంభం

నూతన డంపింగ్​ యార్డు పనులు పూర్తయ్యాయి. నవంబరు మొదటి వారంలో ఈ యార్డును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. క్రషింగ్ యంత్రాలు వచ్చాయి. కోయంబత్తూర్ నుంచి టెక్నీషియన్లు వచ్చి ఇన్​స్టాల్ చేస్తారు. ప్రస్తుతం విద్యుత్​ లైన్లు పనులు నడుస్తున్నాయి. దాదాపు భద్రాచలంలో చెత్త కష్టాలు తీరినట్లే. - శ్రీనివాసరావు,ఈవో