ఏ పనీ చేయకుండా ఊరికే అలా పడుకుని ఉండాలి. అలా ఉన్నందుకు డబ్బులు ఇవ్వాలి – ఇలాంటి కలలు కనేవాళ్లు.. ఇలాంటి జాబ్ ఒకటి ఉంటే బాగుండు అనుకుంటారు కొందరు. అలాంటి వాళ్ల కల నిజం చేసే పోటీ నిజంగానే ఒకటి ఉంది. ఈ పోటీలో పాల్గొనే వాళ్లు ఏ పనీ చేయకుండా రోజంతా మంచం మీద పడుకునే ఉండాలి. ఫోన్ వాడుతూ, బుక్స్ చదువుతూ, తింటూ టైం పాస్ చేయొచ్చు. అలా నెల రోజులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన వాళ్లకు ప్రైజ్‌మనీ దక్కుతుంది.
మోంటెనెగ్రొ యూరప్‌లో ఒక దేశం. అక్కడ బ్రెంజా అనే గ్రామంలో గత పన్నెండేండ్లుగా ‘ఫెస్టివల్ ఆఫ్ లేజీనెస్’ లేదా ‘లేజీ ఒలింపిక్స్’ జరుగుతాయి. ఈ ఒలింపిక్స్‌లో గెలిచిన వాళ్లకు వెయ్యి యూరోలు అంటే దాదాపు 88,000 రూపాయలు ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఈసారి ఈ పోటీలో 21 మంది పార్టిసిపేట్ చేస్తే... వాళ్లలో నలుగురు చివరి వరకు ఉన్నారు. అదేంటి? ఊరికే పడుకోవడం కూడా కష్టమేనా? అనుకుంటున్నారా. మరంతే కదా... ఈ పోటీ మొదలయ్యాక కూర్చున్నా, నిల్చున్నా డిస్క్వాలిఫై చేస్తారు. అయితే.. ఈ ఏడాది కొన్ని రూల్స్ మార్చారు. ఎనిమిది గంటలకు ఒకసారి పావుగంట పాటు బ్రేక్ తీసుకోవచ్చు.
ఈ పోటీలో జోవన్ అనే వ్యక్తి రెండోసారి పార్టిసిపేట్ చేశాడు. అతను ఫుట్ బాల్ క్లబ్లో మార్కెటింగ్ మేనేజర్. ‘మొదటిసారి డబ్బు కోసం, గెలవాలనే తపనతో రెండో సారి పోటీ చేశా. లిడిజ అనే 23 ఏండ్ల బ్యూటీషియన్ తను ఎంత సేపు లేజీగా ఉండగలదో తెలుసుకునేందుకు పార్టిసిపేట్ చేసిందట. ‘‘ఈ పోటీ నుంచి తప్పుకో. కావాలంటే ఆ వెయ్యి యూరోలు మేం ఇస్తాం’ అని లిడిజ కుటుంబ సభ్యులు ఆమెను బతిమిలాడారు. అయినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.