కేబినేట్ బెర్త్ ఎవరికో..పీసీసీ రేసులో మధుయాష్కీ,మహేశ్ గౌడ్

  •     ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రి పదవికీ పోటాపోటీ
  •     షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి మధ్య టఫ్ 

నిజామాబాద్​, వెలుగు :  రాష్ట్ర క్యాబినెట్​ విస్తరణకు ఖాయమనే ప్రచారంజరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందనే విషయం ఉత్కంఠగా మారింది.  మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్ ​రెడ్డికి బెర్తు ఖాయమని భావిస్తుండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని కాంగ్రెస్​ హైకమాండ్​ నిర్ణయించినట్లు తెలియడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న షబ్బీర్​అలీ ఢిల్లీ స్థాయిలో ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

పార్టీ బీఫారంపై గెలిచిన ఎమ్మెల్యేలనే క్యాబినెట్​లో తీసుకుంటామని సీఎం రేవంత్​రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఇటీవల కాంగ్రెస్​లో చేరిన మాజీ స్పీకర్,​ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారానికి బ్రేక్​ పడింది. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్​ పదవికి జిల్లా మాజీ ఎంపీ మధుగౌడ్​ యాష్కీ, ఇందూరు వాసి ఎమ్మెల్సీ మహేశ్ ​గౌడ్​ రేసులో ఉండడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఒకరా.. ఇద్దరా..?

గత అసెంబ్లీ ఎలక్షన్​లో ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్​ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. మొదటి విడత మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. నలుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలలో బోధన్​ సెగ్మెంట్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న సుదర్శన్​రెడ్డి 2009 నుంచి 2014 దాకా అప్పటి కాంగ్రెస్​ గవర్నమెంట్​లో మంత్రిగా పనిచేశారు. ఎల్లారెడ్డి, జుక్కల్​, నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యేలు మదన్​మోహన్​రావు, లక్ష్మీకాంత్​రావు, డాక్టర్​ భూపతిరెడ్డి అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికయ్యారు. సీనియారిటీ ఇతర అంశాలు సుదర్శన్​రెడ్డికి  అనుకూలంగా ఉన్నాయి.

సీఎం రేవంత్​రెడ్డికి దగ్గరి బంధువు కూడా కావడంతో విస్తరణలో చోటు పక్కా అని తెలుస్తోంది. అయితే ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో పట్టుదలతో ఎన్నికల టికెట్​ తెచ్చుకొని గెలిచిన మదన్​మోహన్​రావు కూడా మినిస్టర్​ పదవి ఆశిస్తూ తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్​రెడ్డి కోసం కామారెడ్డి సెగ్మ్ంట్​ వదులుకొని ఎన్నికలప్పుడు అర్బన్​లో పోటీ చేసి ఓటమి చెందిన షబ్బీర్​అలీ పట్ల సీఎంకు ప్రత్యేక అభిమానం ఉంది. మైనారిటీ కోటాలో ఆయన్ను మంత్రివర్గంలో తీసుకోవాలని ఢిల్లీ పెద్దలను ఇటీవల కలిసినప్పుడు సీఎం సిఫార్సు చేశారన్న వాదన వినిపిస్తోంది.

పార్టీ బీఫారంతో గెలిచిన ఎమ్మెల్యేలనే క్యాబినెట్​లో తీసుకుంటామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. దీంతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి పట్ల పార్టీ క్యాడర్లో క్లారిటీ వచ్చేసింది. చివరి దాకా సమీకరణలు ఎవరికి అనుకూలిస్తాయోననే టెన్షన్ క్రియేట్​ అయింది. రెండు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. 

ప్రెసిడెంట్​ పోస్టుకు ప్రయారిటీ 

కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో టీపీసీసీ ప్రెసిడెంట్​ పదవికి మంచి ప్రయారిటీ ఉంది. వర్కింగ్​ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్​ మంత్రివర్గంలో స్థానం కంటే పార్టీ అధ్యక్ష కుర్చీ వైపే మొగ్గు చూపుతున్నారు.  2004 నుంచి పదేండ్లు జిల్లా ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్​ కూడా ప్రెసిడెంట్​ పదవి పట్ల ఆసక్తితో ఉన్నారు. స్టేట్​లోని ఇతర నేతలతో పాటు బీసీ లీడర్లుగా జిల్లాతో అనుబంధమున్న ఈ ఇద్దరు లీడర్లు టీపీసీసీ పదవికి పోటీపడుతున్నారు.