యూడైస్ డేటా.. దర్జాగా  కరెక్షన్

  • గురుకుల సీట్ల కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల అడ్డదారులు
  • వనపర్తి డీఈవో ఆఫీస్ లో వసూలు రాజా.. 
  • స్కూళ్ల పేరుతో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వహణ
  • జిల్లాలో పట్టించుకునే నాథుడు కరువు

వనపర్తిలో బడి పిల్లల యూడైస్ డేటా కరెక్షన్ దందా గుట్టుగా సాగుతోంది. గురుకుల, నవోదయ, సైనిక్ స్కూళ్లల్లో సీట్ల కోసం కొందరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. వచ్చే ఏడాది సీట్ల కోసం ఇప్పటినుంచే మాయ చేస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా వీరికి వనపర్తి డీఈవో ఆఫీస్ లోని ఓ అధికారి సహకరించడం జిల్లాలో సంచలనంగా మారింది.

వనపర్తి, వెలుగు: గురుకులాల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య, ఉచిత భోజన వసతి లభిస్తుండడంతో సీట్ల కోసం ఈ మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఇందులో ప్రవేశాల కోసం ఏటా టీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. రిజర్వేషన్లను బట్టి 4 వ తరగతి విద్యార్థులు మాత్రమే  పరీక్ష రాయడానికి అర్హులు. అందులోనూ 9 నుంచి 11, 13 ఏళ్ల వయసు ఉన్నవాళ్లే రాయాలి.  ఒకసారి పరీక్ష రాసిన వాళ్లు రెండోసారి రాయడానికి వీల్లేదు. ఇదే అదునుగా గల్లీకో ప్రైవేటు కోచింగ్ సెంటర్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎలాగైనా మీ బిడ్డకు సీటు సాధించి పెడుతామని నిరుపేద తల్లిదండ్రులకు గాలం వేస్తున్నారు. దండిగా డబ్బులు తీసుకొని అన్నీ 
మేనేజ్ చేస్తున్నారు.  

డేటా కరెక్షన్ సాగుతోందిలా.. 

వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు తదితర మండలాల్లో ప్రైవేటు గురుకుల కోచింగ్ సెంటర్లు భారీగా ఉన్నాయి. వీరు స్టూడెంట్లకు హాస్టల్ వసతి కల్పించడంతోపాటు టీజీ సెట్, నవోదయ, కోరుకొండ సైనిక్ స్కూల్ తదితర పోటీ పరీక్షలకు దరఖాస్తులు చేయిస్తుంటారు. అయితే, విద్యార్థులు ఇదివరకే  జిల్లాలో ఎక్కడో స్కూళ్లల్లో అడ్మిషన్ తీసుకొని చదవడం వల్ల తమ ఆధార్ నెంబర్ ను యూడైస్ వెబ్ సైట్ లో ఎంట్రీ చేసి ఉంటారు. దీంతో ప్రవేశ పరీక్షకు అప్లై చేసే సమయంలో విద్యార్థి ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయగానే, యూడైస్ లో అతడు చదివే క్లాసు, వయస్సు, కులం, స్కూలు పేరు తదితర వివరాలన్నీ తెలుస్తాయి.  

ఇందులో రెండోసారి పరీక్ష రాసే వివరాలు కూడా ఉంటాయి. దీంతో అనర్హులైన విద్యార్థుల అప్లికేషన్​ను కోచింగ్​సెంటర్ల నిర్వహకులు ముందే డీఈవో ఆఫీస్​లోని ఓ ఉద్యోగికి పంపి, రూల్స్ కు విరుద్దంగా యూడైస్ లో కరెక్షన్​లు చేయిస్తున్నారు. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో గురుకుల సీట్ల కోసం పోటీ తక్కువగా ఉండడంతో.. వనపర్తి జిల్లాకు చెందిన స్టూడెంట్లు ఆయా ప్రాంతాల్లో చదివినట్లు  బోగస్ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇటీవల డీఈవో ఆఫీస్​లోని ఓ అధికారి కమీషన్​పైసల కోసం కోచింగ్ సెంటర్ల  వద్దకు వెళ్లడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

స్కూళ్ల పేరుతో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు

వనపర్తి జిల్లాలోని చాలా కోచింగ్ సెంటర్లకు విద్యాశాఖ నుంచి అనుమతులు లేవు. ఏదో ఒక స్కూల్ పేరుతో అనుమతి పొందడం, ఆ తర్వాత స్కూల్ రూల్స్ ను పక్కన పెట్టి కేవలం గురుకుల, నవోదయ కోచింగ్ సెంటర్లను కొనసాగిస్తున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు మండలాల ఎంఈవోలకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పైగా స్కూళ్ల పేరుతో అనుమతులు తీసుకొని రూల్స్ కు విరుద్దంగా హాస్టళ్లు ఏర్పాటు చేసి, నాసిరకం  భోజనం పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.