పోస్టుల కోసం పోటాపోటీ

  • పదవుల కోసం పంతం పడుతున్న లీడర్లు
  • ఏకాభిప్రాయం కోసం ముఖ్య నేతల కసరత్తు
  • పదవులు దక్కించుకోడానికి ఆశావాహుల పైరవీలు
  • కాంగ్రెస్​ పెద్దల చెంతకు పంచాయితీ

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో నామినేటెడ్​ పోస్టుల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవులతో పాటు ఇతర పోస్టుల భర్తీ అంశం కొలిక్కి వచ్చినట్లు కనబడినా, కొన్ని చోట్ల సీనియర్​ లీడర్లు పదవుల కోసం పట్టుబడుతుండడంలో ఏకాభిప్రాయం సాధ్యం కావడంలేదు. బోధన్​, కోటగిరి మార్కెట్​ పోస్టులు వారం కింద భర్తీచేయగా, మిగితావాటి కోసం భారీ కసరత్తు చేస్తున్నారు. 

ఇందూర్​ మార్కెట్​ కోసం పట్టు

వరంగల్, ఖమ్మం తర్వాత నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ స్టేట్​లో మూడవ  స్థానంలో ఉంది.  ఏటా రూ.2,300 కోట్ల టర్నోవర్​గల ఈ కమిటీ చైర్మన్​ పోస్టుకు డిప్యూటీ మంత్రి హోదా ఉండటం విశేషం. 2019 తరువాత ఖాళీగా ఉన్న చైర్మన్​ పదవి కోసం సీనియర్​ నేతలు పట్టుబట్టారు. జిల్లా కిసాన్​ సెల్​ ప్రెసిడెంట్​ ముప్ప గంగారెడ్డి పేరు దాదాపు ఫైనల్​ అయినట్టు చెప్తున్నా ఈ పదవి కోసం శేఖర్​గౌడ్​ , మరో నేత యాదగిరి పట్టుబడుతున్నారు. మార్కెట్​ రేసు నుంచి తప్పుకోడానికి నగేష్​రెడ్డి స్టేట్​ పోస్టు కోరుతున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్​లో ఆయన రూరల్​ టికెట్​ ఆశించారు.  నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ పదవుల పంచాయతీ ఇప్పుడు  టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేష్​కుమార్ గౌడ్​, రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి చెంతకు చేరింది. వారు ఎవరిని ఫైనల్​ చేస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. వీరిలో ఒకరికి మార్కెట్​ కమిటీ అప్పగించి మిగితా ఇద్దరిలో ఒకరికి జిల్లా గ్రంథాలయం, సాయిబాబా మందిరం  బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు.    

నుడా పోస్టు అంతే

నిజామాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (నుడా) విషయంలోనూ నాలుగు రోజుల కింద అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.  మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ తనయుడు, మాజీ మేయర్​ డి.సంజయ్​ఈ పదవిని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్​ టికెట్​ ఆశించి భంగపడ్డ ఆయన ప్రాధాన్యతగల నుడా పోస్టు కోసం పట్టుబడుతుండగా నగరానికి చెందిన సింగిల్​ విండో మాజీ చైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి, పార్టీలో సీనియర్​ నాయకుడు నరాల రత్నాకర్​  రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్​లో పోటీ చాన్స్​ దక్కని నగర పార్టీ ప్రెసిడెంట్​ కేశవేణు ఇప్పుడు పోటీలోకి వచ్చారు.

 నుడా ఇవ్వని పక్షంలో రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలని నేతలకు కోరారు. 2004 నుంచి 2014 దాకా స్టేట్​లో కాంగ్రెస్​ పవర్​లో ఉన్నప్పుడు ఎలాంటి పదవి దక్కని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడుగు గంగాధర్​ దళిత సామాజిక వర్గం కింద స్టేట్​ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు.  పార్టీ ప్రెసిడెంట్​గా మహేష్​గౌడ్​ బాధ్యతలు స్వీకరించాక, ప్రభుత్వ​ సలహాదారుడు షబ్బీర్​అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, భూపతిరెడ్డి సమావేశమై ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది నిర్ణయించనున్నారు.

ఆర్మూర్​, వర్నితో పాటు..  

ఆర్మూర్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవి టౌన్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సాయిబాబాగౌడ్​కు లోకల్​ ముఖ్యలీడర్లంతా మద్దతిచ్చారు. చివరి నిమిషంలో మండల పార్టీ ప్రెసిడెంట్​ విఠం జీవన్​ పేరు తెరమీదకు రావడంతో  పెండింగ్ లో​ పెట్టారు.  వీరిద్దరి మధ్య  రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేల్పూర్​ మార్కెట్​ కమిటీ కోసం పోటీపడుతున్న జలాల్​పూర్​ మోహన్​రెడ్డి, రెంజర్ల ముత్యంరెడ్డి, కమ్మర్​పల్లి అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీ పదవి కోసం పట్టుబడుతున్న పాలెం నర్సయ్య, గోర్త రాజేందర్​ మధ్య సయోధ్యకు ముఖ్య నేతలు కృషి చేస్తున్నారు.

వర్ని మార్కెట్​ పోస్టును సురేష్​బాబా, నేమాని బుజ్జి, కూనీపూర్​ రాజిరెడ్డి, యలమంచిలి శ్రీనివాస్​, ప్రతాప్​సింగ్​ రాథోడ్​ ఆశిస్తున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్​ను అంటిపెట్టుకున్న తమను గుర్తించాలని వీరిలో కొందరు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్​గౌడ్, జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.