యాసంగిలో తగ్గిన వరి.. పెరిగిన జొన్న

కామారెడ్డి, వెలుగు: గత యాసంగి సీజన్​తో పోలిస్తే జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. 4,21,470 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా అందుకు భిన్నంగా 3,79,256 ఎకరాల్లోనే రైతులు పంటలేశారు. వరిసాగు విస్తీర్ణంలోనూ గణనీయ తగ్గుదల కనిపించింది. 2023 యాసంగిలో 2,61,055 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 2, 31,117 ఎకరాల్లోనే నాట్లేశారు. 29,938 ఎకరాల మేర వరిసాగు తగ్గింది. నీరుడు 19,193 ఎకరాల్లోనే జొన్న పంట వేయగా, ఈ సారి రెట్టింపు స్థాయిలో 36,584 ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేయడం విశేషం. మొత్తం విస్తీర్ణంలో వరి పంటే టాప్​లో ఉండగా, అప్పుడే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.

వర్షాలు తక్కువగా ఉండడం, ఎండాకాలం రాకముందే భూగర్భజలాలు తగ్గడంతో బోర్ల వద్ద నీటిధార తగ్గింది. జిల్లాలో ప్రధానంగా నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల కింద, బోరుబావులు అందుబాటులో ఉన్న రైతులు వరి సాగు చేశారు. వరి తర్వాతి స్థానంలో 58,505 ఎకరాల్లో శనగ పంట సాగు చేయగా, 37,971 ఎకరాల్లో మక్క, 5,427 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగుచేశారు. 1,785 ఎకరాల్లో మినుములు,1,012 ఎకరాల్లో పల్లి సాగు చేయగా, 500 నుంచి వెయ్యి ఎకరాల్లో మిగతా పంటలు సాగులో ఉన్నాయి. గత యాసంగిలో 4,18,964 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ సారి 3,79,256 ఎకరాల్లోనే పంటలు వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో 39,708 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది.

భూగర్భ జలాలే ప్రధాన ఆధారం

జిల్లాలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్​ మండలాలు మినహా మిగతా మండలాల్లోని రైతులు పూర్తిగా భూగర్భజలాలపైనే ఆధారపడి పంటలు వేస్తారు. బోర్ల కింద ఎక్కువగా వరి వేస్తున్నారు. వానాకాలంలో వర్షాలు తక్కువగా కురిశాయి. చెరువులు, కుంటల్లోనూ నీటి నిల్వ అంతగా లేదు. నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. ఎండలు ముదరక ముందే బోర్లలో నీటి ధారలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ సారి 2,31,117 ఎకరాల్లో వరి సాగు చేయగా ఇందులో లక్షా 90 వేల ఎకరాల విస్తీర్ణం బోర్ల పారకం కిందే ఉంది.

కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, మాచారెడ్డి, రామారెడ్డి,  సదాశివ్​నగర్, రాజంపేట, లింగంపేట, గాంధారి, నిజాంసాగర్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ మండలాల్లో బోర్ల కిందనే వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. బాన్సువాడ  డివిజన్​లో ముందుగానే నాట్లు వేయగా, కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో ఆలస్యమైంది. వరిసాగుకు మరో రెండు నెలల పాటు నీళ్లు అవసరం కాగా కొన్ని ఏరియాల్లో ఇప్పటికే  పంటకు తడులు అందడం లేదు. పంట ఎదిగే దశలో నీరందకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది.