BSNL vs Reliance Jio vs Airtel: రీఛార్జ్ ప్లాన్ రేట్లు పెరిగిపోయాయని వర్రీనా..? నో ప్రాబ్లం.. ఈ వార్త మీకోసమే..!

ఈ మధ్య కూరగాయల ధరల కంటే టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్ ధరలు (Recharge Plans) ఎక్కువగా మండిపోతున్నాయి. రిలయన్స్ జియో(Reliance Jio), భారతి ఎయిర్ టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea).. ఇలా ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ యూజర్లపై బాదుడు మొదలుపెట్టేశాయి. 10  కాదు, 20 కాదు.. ఏకంగా ఒకేసారి 25 శాతం రీఛార్జ్ ప్లాన్ ధరలు (Recharge Plan Rates) పెంచి యూజర్లకు షాకిచ్చాయి. దీంతో.. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా మళ్లీ బీఎస్ఎన్ఎల్ బాట పట్టడం ఒక్కటే మార్గమని కొందరు యూజర్లు ట్వీట్స్ చేశారు. టెలికాం కంపెనీలు పెంచిన రీఛార్జ్ ప్లాన్ ధరలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతున్న ఈ తరుణంలో వార్షిక ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ వార్షిక ప్లాన్ల ధరలతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ వార్షిక ధరలు చౌకగా ఉన్నాయి. 2395 రూపాయల వార్షిక రీఛార్జ్ ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాల్స్ పొందే ప్లాన్ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజులు. అంటే.. ఏడాది కంటే మరో 30 రోజుల అదనపు వ్యాలిడిటీతో 2395 రూపాయల దీర్ఘకాలిక ప్లాన్ బీఎస్ఎన్ఎల్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు అందిస్తున్న లాంగ్ టర్మ్  రీఛార్జ్ ప్లాన్స్ లో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లానే అత్యంత చౌకగా ఉంది. కానీ.. జియో, ఎయిర్ టెల్ తో పోల్చితే బీఎస్ఎస్ఎల్ తో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే.. 4జీ, 3జీ స్పీడ్ మాత్రమే యూజర్లు పొందగలరు. కనెక్టివిటీ సమస్యలు కూడా బీఎస్ఎన్ఎల్ యూజర్లను కలవరపెడుతుంటాయి. జియో, ఎయిర్ టెల్ 5జీ డేటా స్పీడ్ ను అందిస్తున్నాయి. కాకపోతే.. ఈ రెండు కంపెనీల వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ ధరలు కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి.

ALSO READ | ఇండియాలో 77 శాతం తగ్గిన షావోమి ప్రాఫిట్‌‌‌‌

ఫ్రీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ అందుబాటులోకి రావడానికి కారణమైన రిలయన్స్ జియో ప్రస్తుతం యూజర్లకు గట్టిగానే వడ్డిస్తోంది. 3599 రూపాయల ధరతో కూడిన వార్షిక ప్లాన్ జియోలో అందుబాటులో ఉంది. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటాను ఈ ప్లాన్ లో భాగంగా జియో అందిస్తోంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు పొందే వెసులుబాటును జియో కల్పించింది. ఇక.. ఎయిర్ టెల్ విషయానికొస్తే.. వార్షిక ప్లాన్స్ లో జియోతో పోల్చితే ఎయిర్ టెల్ ప్లాన్స్ ధరలు కూడా సమంగానే ఉన్నాయి. కానీ.. డేటా ప్రొవైడ్ చేసే విషయంలో మాత్రం ఎయిర్ టెల్ వెనుకంజలో ఉంది. 3599 రూపాయల వార్షిక ప్లాన్ కు జియో రోజుకు 2.5జీబీ డేటా ప్రొవైడ్ చేస్తుంటే, ఇదే ధరతో ఎయిర్ టెల్ రోజుకు 2జీబీ డేటాను మాత్రమే అందిస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. లాంగ్ టర్మ్ ప్లాన్స్ చౌక ధరకు అందిస్తున్న విషయంలో బీఎస్ఎన్ఎల్ విన్నర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. డేటా స్పీడ్ విషయంలో మాత్రం జియో, ఎయిర్ టెల్ తో పోల్చితే బీఎస్ఎన్ఎల్ వెనకబడి ఉంది. డేటా స్పీడ్ తో పని లేదని భావించే యూజర్లు బీఎస్ఎన్ఎల్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వాయిస్ కాల్స్ తోనే ఎక్కువ గడిపేవాళ్లకు బీఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్.