సింగరేణిలో 2,364 మంది వర్కర్ల రెగ్యులరైజ్

  • త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తం : సీఎండీ

హైదరాబాద్, వెలుగు : సింగరేణిలో 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్  మజ్దూర్లుగా రెగ్యులరైజ్  చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీచేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో అండర్​గ్రౌండ్​ మైన్స్​లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు డ్యూటీ చేసిన వారిని రెగ్యులరైజ్  చేస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి వారిని జనరల్  మజ్దూర్లుగా గుర్తిస్తామన్నారు. 

ఈ నేపథ్యంలో సంస్థ అభివృద్ధికి క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. జనరల్  మజ్దూర్లుగా రెగ్యులరైజ్​ చేయడంతో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ ఆధ్వర్యంలో వెయ్యికిపైగా ఇంటర్నల్  ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. కాగా.. ఏడాదిలోనే నిర్ణీత మస్టర్లు పూర్తిచేసిన వారిని జనరల్  మజ్దూర్లుగా రెగ్యులరైజ్  చేయడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ : వాల్టా చట్టానికి పదును..చెరువుల రక్షణకు సర్కారు చర్యలు

 సింగరేణిలో కారుణ్య నియామకాలు, డిపెండెంట్  నియామకాల ద్వారా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా నియమిస్తారు. ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తిచేస్తే జనరల్  మజ్దూర్లుగా పర్మినెంట్​ ఉద్యోగులుగా గుర్తిస్తారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్  ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభిస్తుంది. అలాగే క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది.

ఏరియాల వారీగా రెగ్యులరైజ్​ అయిన ఉద్యోగులు

సింగరేణి వ్యాప్తంగా కార్పొరేట్  ఏరియాలో 25 మంది, కొత్తగూడెంలో 17, ఇల్లందులో 9, మణుగూరులో 21, భూపాలపల్లిలో 476,  రామగుండం-1 ఏరియాలో 563, రామగుండం-2 ఏరియాలో 50, రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలో 240, శ్రీరాంపూర్  ఏరియాలో 655, మందమర్రి ఏరియాలో 299, బెల్లంపల్లిలో 9 మందిని రెగ్యులరైజ్  చేయనున్నారు. వారిలో 243 మంది మహిళలు ఉన్నారు.