నూతన పాలసీకి మిల్లర్లు సహకరించాలి

  • రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహన్ 

నల్గొండ అర్బన్, వెలుగు : సీఎంఆర్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీకి మిల్లర్ల సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహన్ కోరారు. మంగళవారం నల్గొండలోని కలెక్టరేట్ లో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో మిల్లింగ్ ఇండస్ట్రీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, మిల్లర్లు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. సన్న వడ్లు క్వింటాల్​కు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నదన్నారు. మిల్లింగ్ చార్జీలను నాలుగింతలు పెంచినట్లు తెలిపారు. కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ కేటాయించామని, పెండింగ్​లో ఉన్న మిల్లింగ్, ట్రాన్స్ పోర్టు చార్జీలను త్వరగా చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఖరీఫ్, రబీ సీఎంఆర్ లో నల్గొండ జిల్లా ముందు ఉందని, ఖరీఫ్ 99 శాతం, రబీ 75 శాతం సీఎంఆర్ పూర్తి చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై మిల్లర్లు సీఎంఆర్ చెల్లింపులో డిఫాల్ట్ అన్న పదమే రాకుండా చూసుకోవాలని కోరారు. బ్యాంకు గారెంటీ అన్నది కేవలం సీఎంఆర్ వరకు మాత్రమేనని, ఎలాంటి బాకీకి సంబంధం లేదని వివరించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నోడల్ అధికారి అనితారామచంద్రన్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్​పోర్టు, తేమ వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఎస్ వో వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, వ్యవసాయశాఖ జేడీ శ్రావణ్, డీఆర్డీవో నాగిరెడ్డి, వివిధ శాఖ అధకారులు, మిల్లుర్లు 
పాల్గొన్నారు.