ఏరియా రెసిడెన్షియల్..బిల్డింగ్​ కమర్షియల్​!

  • నందగిరిహిల్స్​లో  ‘నెట్ ​నెట్ వెంచర్స్’​ అక్రమ నిర్మాణాలు
  • ‘నందగిరి’ భూమిని, జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీలో ఉన్నట్టు చూపించి అనుమతులు
  • పరిమితికి మించి అంతస్తుల నిర్మాణానికి గతంలో బల్దియా పర్మిషన్లు   
  • విజిలెన్స్‌‌ ఎంక్వైరీలో అక్రమాలు నిజమని తేల్చినా..  హైకోర్టు వివరణ అడిగినా చర్యల్లేవ్​
  • చర్యలు తీసుకోవాలని హైడ్రా, మున్సిపల్​కు సొసైటీ వినతి
  • నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​కు వెళ్తామని వెల్లడిక్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు :హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని రెసిడెన్షియల్ ఏరియా నందగిరి హిల్స్ లో కొందరు  కమర్షియల్ దందాకు తెరలేపారు. హెచ్ఎండీఏ వేలంలో 4.7 ఎకరాల స్థలాన్ని కొన్న వ్యక్తి దానికి ఆనుకొని ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని 865.42 గజాల జాగా కొని ‘నెట్​నెట్​వెంచర్స్’ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. నందగిరి హిల్స్​లో ఉన్న భూమిని, జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీలో ఉన్నట్లు చూపించి అనుమతులు తెచ్చుకోవడం, జీహెచ్ఎంసీ అధికారులు రూల్స్​కు విరుద్ధంగా బిల్డింగ్​కు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతున్నది. 

దీనిపై ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు అక్రమాలు నిజమేనని తేల్చి, చర్యలకు సిఫార్సు చేసినా పట్టించుకోవడం లేదని హైదరాబాద్ నందగిరి హిల్స్​ హౌసింగ్​ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం సొసైటీ  మెంబర్, అడ్వొకేట్​ రాఘవచారి, ప్రెసిడెంట్ యుగంధర్, సెక్రెటరీ రాధిక, మెంబర్ వెదిరె శ్రీరాం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సొసైటీ మెంబర్ జితేందర్ రెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి, ‘నెట్​నెట్ ​వెంచర్స్​’ పేరుతో సాగుతున్న అక్రమ దందాను బయటపెట్టారు. 

కొండను తవ్వి..కమర్షియల్​ కాంప్లెక్స్ 

ఏకంగా కొండను తవ్వి కమర్షియల్ ​కాంప్లెక్స్​కడుతున్నారని హౌసింగ్​ సొసైటీ మెంబర్​ రాఘవాచారి పేర్కొన్నారు.  ‘‘2012 లో పబ్లిక్ యాక్షన్​ ద్వారా హెచ్ఎండీఏ నందగిరి హిల్స్​​లో 4.74 ఎకరాలను అమ్మకానికి పెట్టింది.  నెట్​నెట్ ​వెంచర్స్ సంస్థ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీకి అప్లై చేయగా 2013 లో మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం అనుమతులు వచ్చాయి. అప్పుడున్న నిబంధనల ప్రకారం జీ +4 (5 నుంచి7 సెల్లార్ల వరకు) నిర్మించుకునేలా అనుమతించింది. 2015 నుంచి అనధికారికంగా ఈ కొండను తవ్వడం మొదలుపెట్టారు. 100 మీటర్ల లోతుకు కొండను తవ్వారు. 

దీనిపై స్థానికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే, నెట్​నెట్ ​వెంచర్స్​సంస్థకు రూ.23 కోట్లు పెనాల్టీ విధించింది’ అని వెల్లడించారు. తర్వాత దానికి అనుకుని ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్​సొసైటీకి చెందిన 865 చదరపు గజాల స్థలాన్ని ప్రైవేట్​ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని రాఘవాచారి చెప్పారు. ఈ ప్లాట్ ఫేస్ జూబ్లీహిల్స్ రోడ్​నెంబర్​45 వైపు ఉందని, దీంతో రెండింటిని కలిపేసి కమర్షియల్ కట్టడాలకు తెరలేపారని అన్నారు. ‘‘ప్రస్తుతం ఈ 4.7 ఎకరాల్లో 147 మీటర్ల ఎత్తులో నెట్ నెట్ వెంచర్స్ సంస్థ మెగా కమర్షియల్ కాంప్లెక్స్  కడుతున్నది. కేబీఆర్ పార్కు పక్కన ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ బల్దియా కమిషనర్ కు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదు. 

విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్​కు  ఫిర్యాదు చేస్తే పరిశీలించి అక్రమమని తేల్చింది. జూబ్లీహిల్స్ ప్లాట్ పేరుతో నందగిరి ప్లాట్ లో నిర్మాణం చేపడుతున్నారని చెప్పింది. లక్షా 50 వేల స్క్వేర్ మీటర్లు దాటిన బిల్డింగ్స్ కి ఎన్విరాన్​మెంటల్​పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని, పబ్లిక్​ హియరింగ్ కూడా లేకుండా పాత అప్రూవల్ చూపించి నిర్మాణం చేపట్టిందని చెప్పింది.  దీంతో విజిలెన్స్ అధికారుల రిపోర్టును అమలు చేయాలని సొసైటీ మెంబర్స్​హైకోర్టును ఆశ్రయించారు. దీంతో  కోర్టు మున్సిపల్ అధికారులకు నోటీసులిచ్చి వివరణ ఇవ్వాలని అడిగింది. అయినా, ఇప్పటికీ పనులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి” అని పేర్కొన్నారు. కాగా, దీనిపై త్వరలోనే హైడ్రాకు కంప్లయింట్ చేయబోతున్నామని సొసైటీ సభ్యులు తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా వెళ్తామని అంటున్నారు.

 ఒక్కో ఏడాది ఒక్కోతరహా బిల్డింగ్ ​పర్మిషన్ 

కమర్షియల్ ​కాంప్లెక్స్​ నిర్మాణం కోసం నందగిరి హిల్స్ పరిధిలోని హెచ్ఎండీఏ కు సంబంధించిన 4.74 ఎకరాల భూమిని జూబ్లీహిల్స్​ రోడ్​ నెం.45లో ఉన్న లే అవుట్​లోని 865.42 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్​ను ఒకే స్థలంగా చూపి నెట్ నెట్ సంస్థ అనుమతులు తెచ్చుకున్నది. జూబ్లీహిల్స్ లేఅవుట్​కు వర్తించే జీవో ఎంఎస్ ​నంబర్​305 ను నందగిరి హిల్స్​లోని 4.74 ఎకరాల స్థలానికి వర్తింపజేసింది. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు సహకరించారు. 2017 డిసెంబర్​7న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్​​305 ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలను అనుమతిస్తారు. ఇంపాక్ట్  ఫీజు కడితే మరికొన్ని అంతస్తులు కట్టుకోవచ్చు. 

జూబ్లీహిల్స్​రోడ్ నెం. 45 వైపు 30 మీటర్ల అనుమతి మాత్రమే ఉండడంతో ఇంపాక్ట్​ ఫీజు చెల్లించి, ముందు 45 మీటర్లకు సదరు సంస్థ అనుమతి తెచ్చుకున్నది. కానీ, నందగిరి హిల్స్, హెచ్ఎండీఏ నుంచి కొన్న ప్లాట్​లో15 మీటర్లకే అనుమతి ఉంది. ఇక్కడే తమ తెలివితేటలు ప్రయోగించారు. జూబ్లీహిల్స్​ప్లాట్​నుంచి దారి చూపిస్తూ నందగిరి హిల్స్​లోనూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తెచ్చుకున్నారు. అలా.. 2013లో జీ+4 ఫ్లోర్లు​.. 5 నుంచి 7 సెల్లార్లు, 2021లో జీ+5 ఫ్లోర్లు​.. 7 స్టిల్ట్​ ఫ్లోర్స్, 2022లో జీ+12 ఫ్లోర్లు​.. 7 స్టిల్ట్​ ఫ్లోర్లు, 2023లో జీ+13 ఫ్లోర్లు.. 5 స్టిల్ట్​ ఫ్లోర్లు​, ఒక సెల్లార్​కు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 50 మీటర్ల ఎత్తుకు అనుమతి కోసం అప్లై చేసుకోగా.. అది పెండింగ్​లో ఉంది. ఈ బిల్డింగ్ లో షాపింగ్​మాల్స్, స్టార్​ హోటల్స్​నిర్మించనున్నారు. అయితే, ఈ ప్రాంతంలో పర్యావరణ నిబంధనల ప్రకారం అలాంటి నిర్మాణలకు అనుమతి లేదు. 

పర్యావరణానికి ముప్పు

నెట్​నెట్​ వెంచర్స్​ కమర్షియల్​కాంప్లెక్స్​ నిర్మిస్తున్న ప్రాంతం..కేబీఆర్ నేషనల్​పార్క్​కు అత్యంత సమీపంలో..  పర్యావరణపరంగా సున్నితమైన జోన్​లో ఉంది. పార్కుకు కేవలం 40 మీటర్ల పరిధిలో, 100 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి, 450 అడుగుల ఎత్తులో బిల్డింగ్స్​నిర్మిస్తున్నారు. 2,09,000 చదరపు మీటర్లలో నిర్మిస్తున్న మల్టీపర్పస్​బిల్డింగ్​లో 6 వేల కార్లు, 2 వేల బైక్స్​పార్క్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్​, వాహనాల రణగొణ ధ్వనులతో పర్యావరణానికి, పార్కులోని జంతుజాలం మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం1.5 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో భారీ భవనాలు నిర్మిస్తున్నప్పుడు పబ్లిక్ హియరింగ్​తప్పనిసరి. కానీ ఇక్కడ  ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోవడం గమనార్హం.

విజిలెన్స్​నిర్ధారించినా చర్యలు తీసుకోలే

‘నెట్​ నెట్​వెంచర్స్’ హెచ్ఎండీఏ భూమిని, జూబ్లీహిల్స్​ హౌసింగ్​సొసైటీ భూమిగా చూపుతూ ఆ సంస్థ ప్రతినిధులు ఎన్​. శ్రీనివాస్, జీ అమరేందర్​రెడ్డి  అనుమతులు పొందారని విజిలెన్స్​ఎన్​ఫోర్స్​మెంట్​విభాగం విచారణలో వెల్లడైంది. జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి, అనుమతులిచ్చారని  నిర్ధారించింది.  జీహెచ్ఎంసీ అధికారులు నెట్ నెట్​ వెంచర్స్​ కు అనుకూలంగా వ్యవహరించారని, 15 మీటర్ల ఎత్తుకే అనుమతి ఉన్న చోట, 45 మీటర్లకు అనుమతిచ్చారని బయటపెట్టింది.  865.42 గజాల జూబ్లీహిల్స్​లేఅవుట్​ను డ్రైవ్​వేగా చూపించి, హెచ్ఎండీఏ 4.74 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీ లేఅవుట్​లో చూపారని స్పష్టంచేసింది. 

ఇప్పటికే ఉన్న 7 సెల్లార్లను 7 స్టిల్ట్​ ఫ్లోర్లుగా మార్చడానికి బిల్డింగ్​ను పరిశీలించకుండానే బల్దియా అనుమతులిచ్చిందని పేర్కొంది. నెట్​నెట్​వెంచర్స్​పై  క్రిమినల్,​కుట్ర కేసు నమోదు చేయాలని, అలాగే..అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే, విజిలెన్స్ సిఫార్సు చేసి మూడు నెలలు గడుస్తున్నా... జీహెచ్ఎంసీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా.. జీహెచ్ఎంసీని కోర్టు  వివరణ కోరింది. తప్పుడు డాక్యుమెంట్స్​చూపించి అనుమతులు పొందినప్పుడు, ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు

జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్​ 433, 439, 450, 453 ప్రకారం బిల్డింగ్​అనుమతులను రద్దు చేసే అధికారం జీహెచ్ఎంసీ కమిషనర్​కు ఉంటుంది. 2024 జూన్​18 న ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్​ అధికారులు నిర్ధారించినప్పటికీ.. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాగా, ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నా.. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. మొన్నటి దాకా రాత్రిళ్లు కూడా నిర్మాణ పనులు చేపట్టారని, తాము ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం డే టైంలోనే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు.