సక్సెస్ : అమెరికాలో గెలిచిన ఇండియన్ మదర్‌‌‌‌

ఇండియన్ విమెన్‌‌ ఎక్కడికి వెళ్లినా... ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా... తన జీవితాన్ని తాను కోరుకున్న విధంగా మలచుకోగలదని నిరూపించింది జర్నా గార్గ్‌‌. అనుకున్నది సాధించాలనే బలమైన లక్ష్యం ఉంటే..  ఎలాగైనా విజయం వరిస్తుంది అనడానికి ఆమె గట్టి ఉదాహరణ. పదమూడేండ్ల వయసులో తండ్రి తనకు పెళ్లి చేసేందుకు ట్రై చేశాడు. అప్పుడామె తల వంచుకుని తాళి కట్టించుకోలేదు. ఎదిరించింది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టింది. అలా వెళ్లిన జర్నా ఇప్పుడు స్టాండప్ కమెడియన్‌‌గా ప్రపంచం ముందు నిలిచింది. ఆమె లైఫ్‌‌ జర్నీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అంటే అతిశయోక్తి కాదు. 

జర్నా గార్గ్ న్యూయార్గ్‌‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన స్టాండప్ కమెడియన్. అవార్డు గెలుచుకున్న స్క్రీన్ రైటర్. కొన్నేండ్ల క్రితం లాయర్‌‌‌‌ కూడా. మోటివేషనల్ స్పీకర్‌‌గా పేరు తెచ్చుకుంది. మరో వైపు అమ్మగా  సక్సెస్‌‌ అయ్యింది. ఆమె చేసే స్టాండప్​ కామెడీకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జర్నా టిక్‌‌టాక్​లో పెట్టిన వీడియోలకు మిలియన్ల వ్యూస్‌‌ వస్తుంటాయి. ఇన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన జర్నా ఈ స్థాయికి చేరుకునే దారిలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది.

తల్లి చనిపోయింది

సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన జర్నా గార్గ్ ముంబైలో పుట్టింది. దాదాపు14 ఏండ్ల వయసులో ఆమె తల్లి అనారోగ్యంతో చనిపోయింది. దాంతో వెంటనే ఆమెకు పెళ్లి చేయాలి అనుకున్నాడు తండ్రి. కానీ.. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ‘కనీసం చదువు పూర్తయ్యేవరకైనా పెండ్లి చేయొద్ద’ని తండ్రిని అడిగింది. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత బంధువుల ఇంట్లో రెండేండ్లు ఉండి స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ పూర్తి చేసింది. అప్పటికే జర్నా అక్క అమెరికాలోని ఒహియో సిటీలో సెటిల్‌‌ అయ్యింది. దాంతో ఆమె దగ్గరికి వెళ్లి పై చదువులు చదువుకోవాలని డిసైడ్‌‌ అయ్యింది. పదహారేండ్ల వయసులో అమెరికాకు వెళ్లి కాలేజీలో చేరింది. తర్వాత ‘లా’ స్కూల్‌‌లో చదువుకుంది.

అప్పుడు కూడా జర్నా తండ్రి ఆమెకు పెండ్లి చేసేందుకు ట్రై చేశాడు. కానీ.. ఆమె మాత్రం ‘ఇండిపెండెంట్‌‌గా బతకాలి. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోవాలి’ అనుకుంది. తన కెరీర్‌‌‌‌ని తనకు నచ్చినట్టు మలచుకోవాలని ఆశపడింది. అందుకే ‘లా’ పూర్తికాగానే ఉద్యోగంలో చేరింది. తండ్రి పెండ్లి ఫిక్స్ చేయడానికంటే ముందే తానే ఒక ఇండియన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌‌సైట్​లో ప్రకటన ఇచ్చింది. మామూలుగా ఇలాంటి వెబ్‌‌సైట్లలో తల్లిదండ్రులే అడ్వర్టైజ్​మెంట్స్​ ఇస్తుంటారు. కానీ.. ఇక్కడ మాత్రం జర్నా తన పెండ్లి కోసం తనే స్వయంగా యాడ్‌‌ ఇచ్చుకుంది.

ఎలాంటి భర్త కావాలి అనేది చాలా స్పష్టంగా రాసింది. ఆ యాడ్‌‌ చూసి.. స్విట్జర్లాండ్‌‌లో ఉంటున్న శలభ్ గార్గ్ నుండి ఇ–మెయిల్ వచ్చింది. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక సరైన జోడి అవుతాం అనుకున్నారు. ఎన్నో ఇ–మెయిల్స్‌‌  తర్వాత ఫ్రెండ్స్‌‌గా మారారు. ప్రస్తుతం వాళ్లు ఉంటున్న న్యూయార్క్‌‌ సిటీలోనే మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకు పెండ్లి చేసుకున్నారు.

మొదట్లో లాయర్

పెండ్లి చేసుకున్న తర్వాత కూడా యూనివర్సిటీ ఆఫ్ అక్రోన్ నుండి ఫైనాన్స్‌‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది జర్నా. ఆ తర్వాత కుటుంబానికి సపోర్ట్‌‌గా నిలబడింది. తన భర్త చదువుకుంటానంటే అతనికి సపోర్ట్‌‌ చేసింది. ఆ తర్వాత భర్త ఉద్యోగం చేసేటప్పుడు ఆమె ఇంటి పనులు చూసుకుంది. వాళ్ల పెళ్లయి  ఇప్పటికి 21 ఏళ్లు. వాళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తనకు మొదటి బిడ్డ పుట్టే వరకు మన్‌‌హట్టన్‌‌లో లిటిగేషన్ అటార్నీగా పనిచేసింది. మొదటి బిడ్డ పుట్టిన తరువాత ఆ పని మానేసింది. చిన్న కొడుకు కూడా స్కూల్‌‌కి వెళ్లడం మొదలయ్యాక మళ్లీ ఉద్యోగం చేయాలి అనుకుంది. కానీ.. చాలా ఏండ్లు ఇంట్లోనే ఉండడంతో లాయర్‌‌‌‌గా ప్రాక్టీస్‌‌ చేయాలనే ఆసక్తి పోయింది. 

రచయితగా.. 

జర్నా చదువుకునే రోజుల నుంచే బోలెడన్ని కలలు కనేది. లాయర్‌‌‌‌గా ప్రాక్టీస్​ చేయొద్దని అనుకున్నాక చిన్నప్పుడు కలలను సాకారం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కలల్లో ఒకటి రచయిత కావడం. అందుకే స్క్రీన్‌‌ రైటర్​గా మారి తన కథను తనే రాసుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, పెండ్లి, నిజమైన ప్రేమ, అమెరికాకు వలస... ఆ అంశాలన్నింటితో కథలు రాసింది. చాలా ఫారిన్ సినిమాల్లో భారతీయ కథలన్నీ బాధగా, నిస్సహాయంగా చూపించారు.

అందుకే స్క్రీన్‌‌ప్లే ఎలా రాయాలో, కథని ఎలా రూపొందించాలో నేర్చుకుని మరీ సరదా కథలు రాయడం మొదలుపెట్టింది. ఆమె రాసిన మొదటి కామెడీ స్క్రిప్ట్ ‘రీ అరేంజ్డ్’. ఆ స్క్రిప్ట్​ 2019లో అకాడమీ నికోల్స్ ఫెలోషిప్ పోటీలో సెమీ-ఫైనలిస్ట్‌‌గా ఎంపికైంది. ఆస్టిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పొటీకి వచ్చిన11 వేల స్క్రిప్ట్‌‌ల్లో ఉత్తమ కామెడీ స్క్రీన్‌‌ప్లే అవార్డు గెలుచుకుంది. 

జంప్‌‌ స్టార్ట్‌‌ 

నలభై నాలుగేళ్ల వయసులో తన కెరీర్‌‌ను జంప్‌‌స్టార్ట్ చేసింది. రీ అరేంజ్డ్​ రాశాక ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించేందుకు స్టాండప్‌‌ కమెడియన్‌‌గా ట్రై చేసింది. సక్సెస్‌‌ అయ్యింది. స్టాండప్‌‌ కమెడియన్‌‌గా మారడం వెనుక కూడా పెద్ద కథే ఉంది. అంతకుముందెప్పుడూ ఆమె స్టాండప్‌‌ కామెడీ చేయలేదు. కానీ.. ప్రతి రోజూ ఇంట్లో, ఫ్రెండ్స్ దగ్గర కామెడీ చేసేది. ఆమె చేసే కామెడీ స్టాండప్‌‌ కామెడీకి ఏ మాత్రం తీసిపోదు. ఎప్పుడూ అందరినీ నవ్వించేది. 2018లో న్యూయార్క్ సిటీ ‘ఓపెన్ మైక్‌‌’ ద్వారా మొదటిసారి స్టాండప్‌‌ కామెడీ చేసి అందర్నీ నవ్వించడం మొదలుపెట్టింది.

ఒక రకంగా చెప్పాలంటే జర్నా  చేసిన మొదటి షో ఆమెను ఒక కొత్త మార్గంలోకి నడిపించింది. షోలో చాలా సరదాగా తన గురించి, తన పిల్లల గురించి మాట్లాడింది. అక్కడ ఉన్నవాళ్లంతా విపరీతంగా నవ్వారు. బాగా ఎంజాయ్‌‌ చేశారు. అప్పటినుంచి స్టాండప్‌‌ కమెడియన్‌‌గా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదామెకు. స్టాండప్​ కామెడీతో ‘ది ఫన్నీ బ్రౌన్ మామ్’గా పేరు తెచ్చుకుంది. 

టిక్‌‌టాక్‌‌తో డిజిటల్‌‌ఫ్లాట్‌‌ఫామ్స్‌‌కి.. 

జర్నా కెరీర్‌‌‌‌ మొదలుపెట్టిన ఏడాదికే కరోనా వచ్చి... మనుషుల్ని కాలు బయట పెట్టనీయకుండా చేసింది. దాంతో డిజిటల్​ ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టిక్‌‌టాక్‌‌లో ఆమె పోస్ట్‌‌ చేసిన మొదటి కామెడీ వీడియోకు బాగా రీచ్‌‌ వచ్చింది. టిక్‌‌టాక్‌‌లోకి ఎంట్రీ ఇచ్చాక మొదటి ఏడాదిలోనే 60 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ వచ్చాయి. ఇప్పుడామెని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఉత్తర అమెరికాలోని ఎన్నో క్లబ్స్​లో ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. ఫన్నీ బ్రౌన్ మామ్‌‌గా సోషల్ మీడియాలో తనకి తాను ఒక బ్రాండింగ్​ చేసుకుంది. ఆ తర్వాత ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. అమెజాన్‌‌ ప్రైమ్ వీడియోలో జర్నా చేసిన ‘‘వన్ ఇన్ ఎ బిలియన్” అనే స్టాండప్‌‌ కామెడీ వీడియో స్ట్రీమ్ అవుతోంది. 

మొదట్లో తన కామెడీతో ఇండియన్స్‌‌ని బాగా ఆకట్టుకుంది. ఆమె చేసే  కామెడీకి భారతీయ భర్తలు, అత్తమామలు బాగా కనెక్ట్‌‌ అయ్యారు. ఇప్పుడు మాత్రం ప్రపంచం నలుమూలల నుండి ఆమె కామెడీని చూస్తున్నారు. జర్నా తన ‘బ్రౌన్’ లేబుల్‌‌ను దాటుకుని విభిన్నమైన కల్చర్స్‌‌కి దగ్గరైంది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉన్న కామెడీ క్లబ్స్‌‌లో ప్రదర్శనలు ఇచ్చింది. ‘ది టునైట్ షో స్టార్ జిమ్మీ ఫాలన్’లో ప్రదర్శన తర్వాత స్టాండప్ కమెడియన్‌‌గా మరో మెట్టు ఎక్కిందామె. 

నేర్చుకుంటూ ఉండడమే.. 

జర్నాని మీ విజయ రహస్యం ఏంటని అడిగితే.. ‘‘జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటా. అదే నా సక్సెస్‌‌కి కారణం. స్క్రిప్ట్ రైటింగ్ లేదా కామెడీ.. ఎందులో అయినా బెటర్​గా చేయాలి అనుకుంటా. అందుకే నిరంతరం నేర్చుకుంటా. మొదట్లో స్టాండప్‌‌ కామెడీ మీద నాకు అంత అవగాహన లేదు. అందుకే ప్రాథమిక అంశాలను కూడా నేర్చుకున్నా” అని చెప్తుంది. 

మ్యూట్​ బటన్‌‌

‘మీరు చేసే కామెడీ గురించి మీ  భర్త ఏమంటారు?’ అని చాలామంది ఆమెను అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం ‘‘నా సక్సెస్‌‌ని ఆయన ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. లేదంటే.. నేను ఫేమస్ అయ్యి టీవీలో వచ్చేవరకు చూస్తుంటాడా? ఎప్పుడో మ్యూట్ బటన్‌‌ నొక్కి నన్ను పక్కన కూర్చోపెట్టేవాడు కదా...” అంటుంది. ఈ సమాధానాన్ని తను చేసే ఒక షోలో చాలా సరదాగా చెప్పింది జర్నా. ఇలానే తన నిజ జీవితంలోని విషయాలను జోక్స్‌‌గా చెప్పి ఆడియెన్స్‌‌ని నవ్విస్తుంటుంది. జర్నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. వాళ్లంతా కూడా సరదాగా ఉంటారు.

ఆమె కామిక్‌‌గా మారడానికి అది కూడా ఒక కారణం అట. అంతేకాదు.. తన పేరుతోనే నడుపుతున్న యూట్యూబ్‌‌ ఛానెల్​లో రెగ్యులర్‌‌‌‌గా తన ఫ్యామిలీ పాడ్‌‌కాస్ట్‌‌ పోస్ట్‌‌ చేస్తుంటారు. ఇప్పటివరకు 34 ఎపిసోడ్లు అప్‌‌లోడ్‌‌ చేశారు. అందులో వాళ్ల ఫ్యామిలీ అందరూ మాట్లాడతారు. వాటితోపాటు రెగ్యులర్‌‌‌‌గా కామెడీ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటారు.