మూడేండ్లవుతున్న ముందుకు సాగని భగీరథ పనులు

  •  దోమలపెంట వాసులకు అందని నీళ్లు 
  •  సగంలో ఆగిన రూ.6.85కోట్ల  పనులు

నాగర్​ కర్నూల్​.వెలుగు :  కృష్ణానది కి పక్కనే ఉన్న  దోమలపెంటలోని కాలనీలు,టీఎస్​ జెన్​కో ఉద్యోగుల క్వార్టర్స్​కు  మూడేండ్లయినా తాగునీరు అందడం లేదు.   రూ.6.85కోట్ల తో  చేపట్టిన పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి.    పనులు  పూర్తి చేయాలని అధికారులు  కాంట్రాక్టర్ కు  ఎన్ని సార్లు హెచ్చరించినా.. పనులు మాత్రం సాగడం లేదు.  పైప్​లైన్లు, డబ్లుటీపీ  ,ఓవర్​ హెడ్​ ట్యాంకుల నిర్మాణంలో అనుభవం లేని సంస్థకు పనులు దక్కడం వల్ల లేట్​ అవుతుందని చెప్తున్నారు. 
 

20  ఏండ్ల నుంచి కృష్ణానదిలోకి మోటర్లు దింపి తోడుతున్న నీటిని పైపుల ద్వారా జెన్​కో క్వార్టర్స్​,దోమలపెంట కాలనీ వాసులకు  డైరెక్ట్​గా సరఫరా చేస్తునారు.  ఫిల్టర్​ చేయని  వాటర్​తో సమస్యలు వస్తున్నాయని,   రక్షిత మంచినీరు అందించేందుకు 2021లో మిషన్​ భగీరథ కింద రూ.6.85 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు.  ఇందుకోసం కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన మోటర్లు, పంపుల పక్క నుంచి భగీరథ స్కీం కోసం మోటర్లు,పంపులు,పైప్​లైన్​ నిర్మాణంతో పాటు డబ్లుటీపీ  కట్టాలి.

డబ్లుటీపీ లో ఫిల్టర్​ చేసిన నీళ్లను ఓవర్​ హెడ్​ ట్యాంకుల ద్వారా నల్లాలకు నీరు సప్లయ్​ చేయాలి.   దోమలపెంటలో దాదాపు 600 ఇండ్లు, 250టీఎస్​ జెన్​కో ఉద్యోగుల క్వార్టర్స్​ ఉంటాయి. గతంలో జెన్​కో ఉద్యోగుల క్వార్టర్స్​ కోసం ఏర్పాటు చేసిన డైరెక్ట్​ పంపింగ్​ సప్లై సిస్టం ఇప్పటికీ పనిచేస్తోంది. వర్షాకాలంలో కృష్ణానదికి వరదొస్తే బురద  నీళ్లు వస్తున్నాయి.  వేరే మార్గం లేక   వాటినే వినియోగిస్తున్నారు.

మిషన్​ భగీరథ స్కీం కింద జిల్లాలో గౌరిదేవిపల్లి,కల్వకుర్తిలో రెండు డబ్లుటీపీలు  నిర్మించారు.వీటి కింద దాదాపు 601  ఓవర్​హెడ్​ ట్యాంకులు నిర్మించారు.గతంలో పంచాయతీరాజ్​, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన 589 పాత ఓవర్​ హెడ్​ ట్యాంకులకు భగీరథ ద్వారా వస్తున్న  నీటిని  శుద్ది చేసి సరఫరా చేస్తున్నారు. 

నల్లమల ఫారెస్ట్​,అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​ జోన్​ ఏరియాలో మిషన్​ భగీరథ స్కీం కింద వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లు, భారీ పైప్​లైన్ల నిర్మాణం అసాధ్యమనే ఆలోచనతో అప్పర్​ ప్లాట్​ వరకే దీన్ని పరిమితం చేశారు.  దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి కానీ, మిగలిన పనులు మాత్రం 
అలాగే ఉన్నాయి.

డెడ్​స్టోరేజీ వస్తే మరీ ఇబ్బందులు...

శ్రీశైలం రిజర్వాయర్​లో నీటిమట్టం పడిపోయి డెడ్​స్టోరేజికి చేరిన తర్వాత  డైరెక్ట్​ పంపింగ్​ ద్వారా సప్లై  అయ్యే నీటిలో బురద,వాసన వస్తుందని స్థానికులు వాపోతుంటారు. వివిధ కారణాల వల్ల చేపలు చనిపోతే రెండు మూడు రోజులు అదే నీరు వాడుకోవాల్సి వస్తుంది. లోకల్​గా ఉండే ప్రైవేట్​ వాటర్​ ప్లాంట్ల నుంచి డబ్బులిచ్చి నీటిని కొనాల్సిన పరిస్థితి..

ఒకవేళ పనులు పూర్తయితే.. కృష్ణానది తీరానికి దగ్గర్లో ఉన్న దోమలపెంట, జెన్​కో క్వార్టర్స్​, టూరిజం డిపార్ట్​మెంట్స్​ కాటేజీలు,హరిత హోటల్​కు రక్షిత తాగు నీరు అందే అవకాశం ఉంది.  

నోటీసులు ఇచ్చాం

దోమలపెంటలో డబ్లుటీపీ  నిర్మించి కృష్ణానది నుంచి వాటర్​ ఫిల్టర్​ చేసి తాగునీరందించేందుకు 2021లో పనులు ప్రారంభించాం. వివిధ కారణాలతో  పనులు ఆలస్యమయ్యాయి. కాంట్రాక్ట్​ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చాం. మార్చి వరకు గడువు ఉంది. పనులు పూర్తి చేయకుంటే ఉన్నతాధికారులకు నివేదిస్తాం  
 - సుధాకర్​ సింగ్​, భగీరథ గ్రిడ్​ ఈఈ