సంతోష్​బాబు త్యాగం మరువలేనిది

సూర్యాపేట, వెలుగు : దేశం కోసం కల్నల్​సంతోష్​బాబు చేసిన త్యాగం మరువలేనిదని 31వ తెలంగాణ బెటాలియన్ అధికారి కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంతోష్​​బాబు విగ్రహానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశం కోసం వీరమరణం పొందిన సంతోష్​​బాబు పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

నేటి యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు, సంతోష్​​బాబు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

సంతోష్​​బాబు త్యాగం చిరస్మరణీయం..

కోదాడ, వెలుగు : సరిహద్దుల్లో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్​​బాబు త్యాగం చిరస్మరణీయమని కోదాడకు చెందిన పలువురు మాజీ సైనికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు అన్నారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వర్ధంతి సందర్భంగా శనివారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆయన విగ్రహానికి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్, వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు.

దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కల్నల్ సంతోష్​​బాబు అని కొనియాడారు. కార్యక్రమంలో ఐవీవో స్టేట్ కో–ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు గుండా మధుసూదన్ రావు, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ జగని ప్రసాద్, పీఆర్వో ఎస్.రమేశ్, ఉపేందర్, నాగ సైదులు, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు అనంత చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి వంగవీటి భరత్ చంద్ర తదితరులు  పాల్గొన్నారు.