నల్గొండ, యాదాద్రి కలెక్టర్ల బదిలీ

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : నల్గొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి రంగారెడ్డికి బదిలీ అయ్యారు. యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే టూరిజం డైరెక్టర్​గా నియమితులయ్యారు. ఇప్పటివరకు టూరిజం డైరెక్టర్​గా ఉన్న ఇలా త్రిపాఠికి నల్గొండ కలెక్టర్​గా పోస్టింగ్ ఇచ్చారు. 

ఐ అండ్ పీఆర్ స్పెషల్​కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.హనుమంతరావు యాద్రాద్రి కలెక్టర్​గా నియమితులయ్యారు. యాదాద్రి అడిషనల్ (రెవెన్యూ) కలెక్టర్ బెన్ షాలోమ్ నారాయణపేటకు బదిలీ అయ్యారు. భువనగిరి ఆర్డీవో అమరేందర్ నల్గొండ డీఆర్​వోగా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు హెచ్​ఎండీఏలో ఎస్టేట్​ఆఫీసర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోపిరెడ్డి వీరారెడ్డి యాదాద్రి అడిషనల్ కలెక్టర్ గా నియమితులయ్యారు.​ 

మేడ్చల్​– మల్కాజ్​గిరి వెల్ఫేర్ ఆఫీసర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.కృష్ణారెడ్డి భువనగిరి ఆర్డీవోగా నియమితులయ్యారు. కాగా, లోక్​సభ ఎన్నికల ముందు యాదాద్రి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ (లోకల్​బాడి) గా బాధ్యతలు నిర్వర్తించిన గోపిరెడ్డి వీరారెడ్డిని బదిలీ చేశారు. తాజాగా మళ్లీ ఆయనే అడిషనల్​కలెక్టర్ (రెవెన్యూ)గా  ప్రభుత్వం నియమించింది. సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.

జగిత్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి.రాంబాబు సూర్యాపేటకు రానున్నారు. దేవరకొండ ఆర్డీవోగా ఎస్.రమణరెడ్డి, నల్గొండ ఆర్డీవోగా వై.అశోక్ రెడ్డి, నల్గొండ జిల్లా భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా జి.వెంకటేశ్వర్లు రానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.