మహబూబ్​నగర్​ జిల్లాలో తప్పులు లేకుండా ఇంటింటి సర్వే : కలెక్టర్ విజయేందిర బోయి

అడ్డాకుల, వెలుగు: జిల్లాలో ఇంటింటి సర్వేను మహబూబ్​నగర్​ జిల్లాలో పక్కాగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్  విజయేందిర బోయి తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఇండ్ల జాబితా తయారీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా, కలెక్టర్  భూత్ఫూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డ్, భూత్ఫూర్  మండలం శేరిపల్లి గ్రామం, మూసాపేట మండలం పొల్క పల్లి గ్రామంలో ఈ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఇండ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలు, పాటిస్తున్న పద్ధతులను కలెక్టర్  పరిశీలించి పలు సూచనలు చేశారు. 

ఇండ్ల సర్వే కోసం స్టిక్కర్లను అతికిస్తూ, వాటిపై నమోదు చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ఈ నెల 6 నుంచి చేపట్టనున్న సర్వేను సక్సెస్​ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏ ఒక్క ఇల్లు మిస్​ కాకుండా పక్కాగా హౌస్  లిస్టింగ్  చేయాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా పట్టణాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇండ్ల జాబితా పక్కాగా తయారు చేస్తే సర్వే సమగ్రంగా చేపట్టవచ్చన్నారు. మూడు రోజుల్లో హౌస్  లిస్టింగ్  పూర్తి చేయాలని సూచించారు. ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్  వెంట భూత్ఫూర్  మండల ప్రత్యేక అధికారి, హార్టికల్చర్​ డీడీ వేణుగోపాల్, ఇన్​చార్జి మున్సిపల్  కమిషనర్  శంకర్  ఉన్నారు.

సర్వే కు రెడీగా ఉండాలి

గద్వాల: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు రెడీగా ఉండాలని గద్వాల కలెక్టర్  సంతోష్  ఆదేశించారు. శుక్రవారం మల్దకల్  మండలం సద్దనోని పల్లి, గద్వాల టౌన్ లోని 37, 20 వార్డుల్లో కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితా తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. సర్వేను సక్సెస్​ చేసేందుకు ఇంటింటి పరిశీలన పూర్తి చేసి, సర్వేలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. 

ఒకే ఇంట్లో ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటే బై నంబర్లు ఇవ్వాలన్నారు. ఈ నెల 6 నుంచి 18 వరకు సర్వే నిర్వహించాలని, 19 నుంచి 27 వరకు డేటా ఎంట్రీని ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ, మున్సిపల్  కమిషనర్  దశరథ్  ఉన్నారు.

వివరాలు పక్కాగా నమోదు చేయాలి

కోస్గి: సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలను పక్కాగా నమోదు చేయాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. మండలంలోని నాచారం గ్రామంలో పర్యటించి ఎన్యుమరేటర్లకు సర్వేపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ నవంబర్  6 నుంచి నిర్వహించనున్న సర్వేను సక్సెస్​ చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలన్నారు. 

సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో వేణుగోపాల్ రెడ్డి, ఏపీవో నర్సింలు, ఫీల్డ్  అసిస్టెంట్  అబ్దుల్  ఖదీర్, పంచాయతీ కార్యదర్శి సునీత ఉన్నారు.