ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం : వెంకట్ రావు  

సూర్యాపేట, వెలుగు: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ అధైర్య పడొద్దని కలెక్టర్ ఎస్.వెంకట్​రావు సూచించారు. సోమవారం ఆత్మకూరు(ఎస్) మండలంలోని పీఏసీఎస్  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. మిల్లర్లు వెంటనే వాహనాల్లో ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 31,335 మంది రైతుల నుంచి 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ వినోద్ కుమార్, పీఏసీఎస్​సిబ్బంది, రైతులు ఉన్నారు.