రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డు, నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు తెచ్చిన ధాన్యం తేమను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా పండుతుందని, డిసెంబర్ 15 నాటికి కోతలు పూర్తవుతాయని తెలిపారు.

 సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. మార్కెట్ కు వచ్చే ధాన్యంలో తాలు లేకుండా ఆరబెట్టి తూర్పార బట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒకవేళ సరైన తేమ శాతంతో ధాన్యం కేంద్రాలకు వస్తే వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు. 

అనంతరం హాలియా మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు, నిడమనూరు, రాజన్నగూడెం, తుమ్మడం వల్లబాపురం గారమాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. ఆమె వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,  మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎం.దుర్గారెడ్డి, ఎంపీడీవో సుజాత, ఇన్​చార్జి​ తహసీల్దార్ మధు, నాయకులు తదితరులు ఉన్నారు.