క్వాలిటీ వడ్లు తీసుకొచ్చి బోసస్ పొందాలి : కలెక్టర్ త్రిపాఠి

  • కలెక్టర్ త్రిపాఠి 

మిర్యాలగూడ, వెలుగు : రైతులు క్వాలిటీ వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి బోనస్ పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి సమీపంలోని వైష్ణవి రైస్ మిల్లును ఆయన సందర్శించి ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 340 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  82 సన్న రకం, 258 దొడ్డు రకం కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సీజన్ లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేసినట్లు చెప్పారు.

 2.80 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 4.70 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.7 కోట్ల చెల్లించినట్లు తెలిపారు. ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లావ్యాప్తంగా 6 గోదాములను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ హరిబాబు, సివిల్ సప్లై డీటీ జావెద్, ఏడీఏ దేవ్ సింగ్, ఏవో సైదా నాయక్, రైస్​ మిల్లర్లు తదితరులు ఉన్నారు.