ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

హుజూర్ నగర్, నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు : ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. ప్రభుత్వ డిజిటల్ సర్వే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళవారం హుజూర్ నగర్  మున్సిపాలిటీలోని 4వ వార్డులో  జరిగిన సర్వేను పరిశీలించారు. డేటా ఎంట్రీలో తీసుకోవాల్సిన అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన చేసేందుకు అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నట్టు తెలిపారు.

దరఖాస్తుల పరిశీలనలో మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారి, రెవెన్యూ అధికారి, నీటిపారుదలశాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు సంబంధించిన భూమి ఉన్నట్లయితే ఎల్ఆర్ఎస్ వర్తించదన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అధికారులకు సహకరించాలని కోరారు.

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మున్సిపాలిటీ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు కలిసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు. అంతకుముందు పాలకవీడు మండల కేంద్రలోని పీహెచ్​సీ, తహసీల్దారు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను కలెక్టర్​తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ యాకూబ్ పాషా, వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.