రైతులు కొనుగోలు  కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

    
తుంగతుర్తి, వెలుగు :
 ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం, జాజిరెడ్డిగూడెం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్​వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో శాండ్ ట్యాక్స్ అమలు, ధరణి, కల్యాణలక్ష్మి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

గవర్నర్ పర్యటనకు ఏర్పాటు చేయాలి -

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలన్నారు.

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గవర్నర్ కు  వివరించాలని సూచించారు. గవర్నర్ తిలకించేందుకు ఐదు స్టాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం జిల్లా అధికారులు, కళాకారులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.